Nithyananda: నిత్యానంద ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారని హైకోర్టుకు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం

  • నిత్యానందపై అత్యాచార ఆరోపణలు
  • విదేశాలకు పారిపోయిన నిత్యానంద
  • బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ
  • వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వలేకపోయామన్న సర్కారు

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నిత్యానంద బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది. బెయిల్ రద్దుకు సంబంధించిన నోటీసులను నిత్యానందకు వ్యక్తిగతంగా ఇవ్వలేకపోయామని, నిత్యానంద ఇప్పుడు ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నాడని కర్ణాటక సర్కారు తెలిపింది.

బెయిల్ రద్దు పిటిషన్ కు సంబంధించిన నోటీసులను నిత్యానంద ఆశ్రమంలో కుమారి అర్చనానందకు ఇచ్చామని సీఐడీ విభాగం అధికారి బాలరాజ్ హైకోర్టుకు విన్నవించారు. కాగా, కుమారి అర్చనానంద ఈ విషయంలో హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. పోలీసులకు తనకు బలవంతంగా నోటీసులు అందించారని అఫిడవిట్ లో పేర్కొన్నారు.

అటు, పిటిషనర్ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ, కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకే నిత్యానంద పారిపోయాడని ఆరోపించారు. నిత్యానంద ఈక్వెడార్ లో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం విచారణ ఫిబ్రవరి 5కి వాయిదా వేశారు.

More Telugu News