Amaravati: ఊపందుకున్న అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ విచారణ.. రంగంలోకి దిగిన ఈడీ!

  • ఇన్సైడర్ ట్రేడింగ్ విచారణలో సహకరించాలని ఈడీని కోరిన ఏపీ సీఐడీ
  • ఈసీఐఆర్ ను నమోదు చేసిన ఈడీ
  • హైదరాబాదులోని ఈడీ జోనల్ కార్యాలయంలో కేసు నమోదు

అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం సీఐడీ చేత విచారణ జరిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి సీఐడీ విచారణ వేగంగా జరుగుతోంది. మరోవైపు అంశంపై దర్యాప్తు జరిపేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా సన్నద్దమవుతోంది. ఈ మేరకు 'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది.  

సదరు కథనం వివరాల్లోకి వెళ్తే, ఇన్సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరుపుతున్న సీఐడీ... ఈడీ సహకారం కోరింది. అమరావతిలో ఏదైనా మనీ లాండరింగ్ జరిగిందా? అవినీతి కార్యకలాపాలు చోటు చేసున్నాయా? వాస్తవాలు బయటకు రాకుండా చేశారా? అనే అంశాలను పరిశీలించాలని ఈడీని ఏపీ సీఐడీ కోరింది. ఈ నేపథ్యంలో ఈడీకి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ, ఏపీ సీఐడీ సమర్పించిన ఆధారాలు, వివరాలతో ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)ను నమోదు చేశామని తెలిపారు. మనీ లాండరింగ్ చట్టం కింద ఏదైనా దర్యాప్తును ప్రారంభించేందుకు తొలుత ఈసీఐఆర్ ను నమోదు చేస్తారు. ఏపీ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం కూడా హైదరాబాదులోని ఈడీ జోనల్ కార్యాలయంలో కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదైంది.

గతంలోనే ఈడీ, ఐటీ శాఖలకు ఏపీ సీఐడి అడిషనల్ డీఐజీ సునీల్ కుమార్ లేఖలు రాశారు. ఈడీకి రాసిన లేఖలో... అమరావతిని రాజధానిగా  ప్రకటించడానికి ముందు ఆ ప్రాతంలో భారీ ఎత్తున నగదు లావాదేవీలు, భూములు రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపారు. వెంకటపాలెం గ్రామానికి చెందిన పి.బుజ్జి అనే మహిళ పెట్టిన కేసు వివరాలను తన లేఖలో పేర్కొన్నారు. 761.34 ఎకరాల భూమిని 797 మంది తెల్ల రేషన్ కార్డు కలిగిన వ్యక్తులు కొన్నారని... వీటి విలువ రూ. 276 కోట్లని లేఖలో తెలిపారు. 797 మంది రైతుల్లో కేవలం 273 మందికి మాత్రమే పాన్ కార్డులు ఉన్నాయని చెప్పారు.

ఐటీ చీఫ్ కమిషనర్ కు రాసిన లేఖలో... తెల్ల రేషన్ కార్డులు కలిగిన వ్యక్తులు భారీ మొత్తంలో డబ్బును ఖర్చుపెట్టి భూములు కొన్నారని, వీటిలో అత్యధికంగా నగదు లావాదేవీలే ఉన్నాయని సునీల్ కుమార్ తెలిపారు. వీరంతా తమ ఆదాయ వివరాలను వెల్లడించలేదని, ఆదాయపు పన్నును ఎగవేశారని ఆరోపించారు. దీంతో పాటు అనుమానాస్పదంగా ఉన్న లావాదేవీల వివరాలను ఈడీ, ఐటీ అధికారులకు పంపించారు. ఈ నేపథ్యంలో, ఇన్సైడర్ ట్రేడింగ్ లో విచారణ దిశగా ఈడీ అడుగులు వేస్తోందని తెలుస్తోంది.

More Telugu News