Cooli: కూలి పనులు చేసుకునే వ్యక్తికి షాకిచ్చిన ఐటీ అధికారులు

  • రూ. 2.59 లక్షల పన్ను చెల్లించాలంటూ నోటీసులు
  • తన పూర్వ యజమాని మోసం చేశాడంటున్న బాధితుడు
  • ఇంత మొత్తాన్ని ఎలా చెల్లించగలనంటూ ఆవేదన  

ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇచ్చిన నోటీసుతో ఓ దినసరి కూలీ బెంబేలెత్తిపోయాడు. రు. 2.59 లక్షల పన్ను చెల్లించాలని కోరుతూ సదరు వ్యక్తికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని నబరంగ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, సనధారా గంద్ అనే వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2014-15లో ఈ వ్యక్తి రూ. 1.47 కోట్ల లావాదేవీలను నిర్వహించాడని... ఈ నేపథ్యంలో రూ. 2.59 లక్షల పన్నును చెల్లించాలంటూ అతనికి నోటీసులు అందాయి. దీంతో, అతను షాక్ కు గురయ్యాడు. కూలి పనులు చేసుకునే తాను ఈ మొత్తాన్ని ఎలా చెల్లించగలనని ఆవేదన వ్యక్తం చేశాడు.

గతంలో తాను పప్పూ అగర్వాల్ అనే వ్యక్తి ఇంట్లో ఏడేళ్లు పని చేశానని సనధారా గంద్ తెలిపాడు. ఆ సమయంలో తన భూమి పట్టాతో పాటు తెల్లకాగితంపై సంతకం చేసి ఇచ్చానని... పప్పూ యాదవ్ తనను మోసం చేశాడని వాపోయాడు. ఆయన ఏదో చేయబట్టే తనకు నోటీసులు వచ్చాయని చెప్పాడు.

More Telugu News