Veerappan: తుపాకి పేల్చిందని మహిళ అరెస్ట్.. తీరా ఆమె ఎవరో తెలిసి పోలీసుల షాక్!

  • గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ సన్నిహితురాలి అరెస్ట్
  • చెరకు పొలంలో ఏనుగులను వెళ్లగొట్టేందుకు తుపాకి కాల్పులు
  • 27 ఏళ్లుగా పరారీలో ఉన్న ఆమెకు సంకెళ్లు

ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ హతమై 15 సంవత్సరాలు అయింది. ఇన్నాళ్లకు అతడి పేరు మళ్లీ బయటకు వచ్చింది. గత 27 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న వీరప్పన్ సన్నిహితురాలు ఒకామెను కర్ణాటకలోని కోల్లెగళ్ క్రైం బ్రాంచ్ పోలీసులు చామరాజనగర్ జిల్లాలోని జాగెరి గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. తన చెరకు పొలాన్ని ధ్వంసం చేస్తున్న ఏనుగులను తరిమికొట్టేందుకు తుపాకి కాల్పులతో శబ్దాలు చేయగా, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

అనంతరం, తుపాకి ఫైరింగ్ ఎలా వచ్చని పోలీసులు ఆమెను ప్రశ్నించగా అసలు విషయం తెలిసి ఖిన్నులయ్యారు. వీరప్పన్, అతడి ముఠాతో తనకు సంబంధాలు ఉన్నాయని, తాను వీరప్పన్ అనుచరురాలినని చెప్పింది. అంతేకాదు, తుపాకి, పేలుడు పదార్థాలను పేల్చడంలో శిక్షణ ఇచ్చేదానినని చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెపై ‘టాడా’ చట్టం కింద కేసు నమోదు చేశారు.

40 ఏళ్ల వయసున్న ఆమె పేరును స్టెల్లా మేరీగా గుర్తించినట్టు చామరాజనగర్ ఎస్పీ హెచ్‌డీ ఆనందకుమార్ తెలిపారు.1993 నుంచి ఆమె పరారీలో ఉందని పేర్కొన్నారు. వీరప్పన్ మృతి అనంతరం ఆమె కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News