Bumrah: భారత్ విజయాల్లో ‘ఎక్స్ ఫ్యాక్టర్’ బుమ్రా: పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్

  • బుమ్రా తోడ్పాటుతో భారత్ టీ20ల్లో చరిత్ర సృష్టించింది
  • గాయాలనుంచి వేగంగా కోలుకున్నాడు
  • ఐదో టీ20లో బుమ్రా బౌలింగ్ అద్భుతం

న్యూజిలాండ్ తో టీ 20 సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేయడం వెనక ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడని రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరుపొందిన పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. బుమ్రా తోడ్పాటుతోనే భారత్ చరిత్ర సృష్టించిందన్నాడు. ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 5-0 తో క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించిందన్నారు.

ఈ రోజు అక్తర్ యూ ట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. భారత్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్ ల వెనక ‘బుమ్రా ఎక్స్ ఫ్యాక్టర్ ’గా ఉన్నాడన్నాడు. కివిస్ తో చివరి టీ20లో బుమ్రా 12 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడని ప్రశంసించాడు.

‘బుమ్రా మంచి నైపుణ్యమున్న ఆటగాడు. గాయాలనుంచి వేగంగా కోలుకున్నాడు.  2 నుంచి 3 మ్యాచుల్లో బుమ్రా పూర్తి రిథమ్ లోకి వచ్చాడు. కొంతమంది బౌలర్లు గాయాల నుంచి కోలుకోవడానికి చాలా సమయాన్ని తీసుకుంటారు. చివరి టీ20లో బుమ్రా 12 పరుగులకు 3 వికెట్లు పడగొట్టడం సూపర్. డెత్ ఓవర్లలో బుమ్రా బ్యాట్స్ మెన్ ను నియంత్రించడంలో దిట్ట. సైనీ, శార్దూల్ కూడా మంచి బౌలర్లే.. కాని బుమ్రా ఇండియా తరపున ఉన్న ఎక్స్ ఫ్యాక్టర్’ అని అక్తర్ ప్రశంసించాడు.

More Telugu News