Chandrababu: మూడు రాజధానులు వద్దని దక్షిణాఫ్రికా వాళ్లే మొత్తుకుంటున్నారు... మీరేంటి?: చంద్రబాబు

  • మూడు రాజధానుల అంశంపై వీడియోల ప్రదర్శన
  • తలకు మించిన భారం అవుతోందన్న దక్షిణాఫ్రికా ప్రధాని
  • ఆఫీసులు తరలించినంత మాత్రాన అభివృద్ధి జరగదన్న బాబు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలను తూర్పారబట్టారు. మూడు రాజధానులు ప్రపంచంలో దక్షిణాఫ్రికాలో తప్ప మరెక్కడా లేవని, వాళ్లు కూడా మూడు రాజధానులతో తల బొప్పికట్టించుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా ప్రధాని అక్కడి చట్టసభలో చేసిన ప్రసంగాన్ని క్లిప్పింగ్ వేసి ప్రదర్శించారు. మూడు రాజధానుల్లో రెండు రాజధానులు అత్యంత సమస్యాత్మకం అని, ఆ రెండు రాజధానుల మధ్య తిరిగేందుకు ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తలకుమించిన భారం అవుతోందని దక్షిణాఫ్రికా ప్రధాని చట్టసభలో సమస్యలను ఏకరవుపెట్టడం ఆ క్లిప్పింగ్ లో కనిపించింది.

ఆ తర్వాత జాతీయ పాత్రికేయుడు శేఖర్ గుప్తా అభిప్రాయాలను కూడా వీడియో రూపంలో మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు. శేఖర్ గుప్తా మూడు రాజధానుల నిర్ణయాన్ని పూర్తిగా తుగ్లక్ నిర్ణయమని కొట్టిపారేశారు. పైగా అలాంటి నిర్ణయాలు రెట్టింపు కెఫీన్ కలిగిన 20 కాఫీలు తాగిన వాళ్లు, లేక మరేదైనా మాదకద్రవ్యం సేవించిన వాళ్లే పైత్యం ప్రకోపించిన సమయంలో తీసుకుంటారని విమర్శించారు. ఇలాంటి పిచ్చితనాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని శేఖర్ గుప్తా అభిప్రాయపడ్డారు.

అంతేకాదు, సీఎం జగన్ తండ్రి వైఎస్సార్ ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవాడు కాదని, ఆయన ఓ దార్శనికుడని కొనియాడారు. వైఎస్సార్ గనుక ఉండుంటే ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు కూడా ఊహించలేనంత పెద్ద నగరాన్ని నిర్మించేవాడని తెలిపారు. ఈ క్లిప్పింగ్స్ ముగిసిన అనంతరం చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్ర విభజన తర్వాత తలసరి ఆదాయం ఎంతో తక్కువగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానులు పెడితే ప్రజలకు స్థిర నివాసం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆఫీసులు తరలించినంత మాత్రాన అభివృద్ధి జరగదని, కియా మోటార్స్ వంటి సంస్థలు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు.

More Telugu News