Corona Virus: ఈ నెలలో నా పెళ్లి ఉంది.. నన్ను చైనా నుంచి తీసుకెళ్లండి: కర్నూలు యువతి ఆవేదన

  • నాకు కరోనా లక్షణాలు లేవు
  • ఆరోగ్యంగా ఉన్నానని నిరూపించుకుంటా
  • వైరస్ సోకిందో? లేదో? అనే విషయాన్ని చైనా అధికారులు నిర్ధారించడం లేదు

చైనాలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం ఇప్పటికే రెండు విమానాల ద్వారా అక్కడున్న భారతీయులను స్వదేశానికి రప్పించింది. అయితే, జ్వరం తదితర కారణాలతో బాధపడుతున్న వారిని మాత్రం చైనా అక్కడి నుంచి బయటకు పంపించడం లేదు. వీరందరికీ పరీక్షలు చేయించి, కరోనా వైరస్ లేదని నిర్ధారించుకున్న తర్వాతే స్వదేశాలకు వెళ్లేందుకు అనుమతినిస్తోంది. ఈ నేపథ్యంలో, కర్నూలు జిల్లాకు చెందిన జ్యోతి అనే యువతి చైనాలోనే ఉండిపోయారు. ఆమెకు స్వల్ప జర్వం ఉండటంతో వైరస్ సోకిందేమోననే అనుమానంతో ఆమెను భారత్ కు పంపించలేదు. ఈ నేపథ్యంలో, టీసీఎల్ కంపెనీలో పని చేస్తున్న ఆమె వీడియో ద్వారా భారత ప్రభుత్వానికి ఓ విన్నపం చేశారు.

'నా సహచరులతో పాటు నేను కూడా వూహాన్ నుంచి తొలి విమానంలోనే ఇండియాకు రావాల్సి ఉంది. కానీ శరీరం వేడిగా ఉండటంతో నాతో పాటు మరొకరిని ఆపేశారు. రెండో విమానంలో తీసుకెళ్తామని చెప్పారు. ఆ తర్వాత రెండో విమానంలో కూడా తీసుకెళ్లడం లేదని నాకు ఫోన్ వచ్చింది. మాకు వైరస్ సోకిందో? లేదో? అనే విషయాన్ని చైనా అధికారులు నిర్ధారించడం లేదు. కానీ, ఆరోగ్యంగానే ఉన్నామనే విషయాన్ని నిరూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.

శారీరకంగా కొంచెం అలసిపోవడం, కరోనా నేపథ్యంలో ఒత్తిడికి గురికావడం వల్లే శరీర ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు పెరిగింది. నా శరీర ఉష్ణోగ్రత ప్రస్తుతం నార్మల్ గానే ఉంది. మాకు కరోనా వ్యాధి లక్షణాలు లేవు. మమ్మల్ని తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ నెలలో నా పెళ్లి ఉంది. దయచేసి నాకు సాయం చేయండి' అని జ్యోతి విన్నవించింది. ఈ వీడియోను చూసినవారంతా ఆవేదనకు గురవుతున్నారు.

More Telugu News