VV Lakshminarayana: ఆ అధ్యాయం ముగిసింది... ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకోలేదు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • జనసేనకు రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ
  • కారణాలను లేఖలోనే తెలిపానన్న సీబీఐ మాజీ జేడీ
  • ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని వెల్లడి

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనలో తన ప్రయాణం ముగిసిన అధ్యాయం అని తెలిపారు. తన రాజీనామాను పార్టీ హైకమాండ్ ఆమోదించిందని వెల్లడించారు. తన రాజీనామాకు గల కారణాలను లేఖలోనే తెలిపానని చెప్పారు.

ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి వరకు వెళతానని లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఇకమీదట కూడా ప్రజాసేవ చేస్తూనే ఉంటానని, ప్రజాసేవకు అత్యుత్తమ వేదిక రాజకీయ రంగమేనని ఉద్ఘాటించారు. అయితే, ఏ పార్టీలోకి వెళ్లాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. కేంద్ర బడ్జెట్ ప్రజా హితంగా ఉందని, పలు రంగాలకు కేటాయింపులు బాగున్నాయని అభిప్రాయపడ్డారు. యువతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించేలా బడ్జెట్ లో చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. అనుబంధ బడ్జెట్ లో ఏపీకి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఏపీకి నిధుల కోసం ఎంపీలు ప్రయత్నించాలని సలహా ఇచ్చారు.

More Telugu News