నిర్భయ కేసులో కేంద్రం పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఢిల్లీ హైకోర్టు

02-02-2020 Sun 21:08
  • నిర్భయ దోషులకు రెండోసారి ఉరి వాయిదా
  • స్టే ఇచ్చిన పాటియాలా హౌస్ కోర్టు
  • సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన కేంద్రం
నిర్భయ దోషుల ఉరిశిక్షపై పాటియాలా హౌస్ కోర్టు స్టే విధించడాన్ని కేంద్రం సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఆదివారం జరిగిన విచారణలో భాగంగా, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. నిర్భయ దోషులు కావాలనే శిక్షను జాప్యం చేసే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు దాఖలు చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని వివరించారు. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా ఇప్పటివరకు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయకపోవడమే అందుకు నిదర్శనమని చెప్పారు. నలుగురు దోషులపై స్టే ఎత్తివేయాలని కోరారు. అయితే, దీనిపై జస్టిస్ సురేశ్ ఖైత్ వ్యాఖ్యానిస్తూ, పూర్తిస్థాయిలో వాదనలు విన్న తర్వాత ఉత్తర్వులు వెలువరిస్తామని తెలిపారు.