Karnataka: ఒక్క తప్పటడుగు వేసి... దిద్దుకోలేక యువతి ఆత్మహత్య!

  • తొలిసారి ప్రేమించిన యువకుడి చేతిలో మోసం
  • రెండోసారీ కూడా అటువంటి అనుభవమే
  • తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని ఆత్మహత్య

ఒకసారి తప్పు చేసింది. దాన్ని దేవుడు సరిదిద్దాడు. తిరిగి అదే తప్పును మరోసారి చేసిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇద్దరు యువకులు ప్రేమ పేరిట వంచించి, వేధించగా, తట్టుకోలేకపోయిన ఆమె, విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని శివమొగ్గ శివార్లలో ఉన్న గొంది చట్నహళ్లి గ్రామంలో జరిగిన ఘటన వెనుక పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

సుప్రియ (19) అనే యువతి ఓ ప్రయివేటు కళాశాలలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతూ ఉండగా, సాగర్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. సుప్రియ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉండటంతో, ఆమె డబ్బుపై కన్నేసిన సాగర్, తనలోని కిరాతకుడిని బయటకు తెచ్చాడు. సుప్రియతో కలిసున్న వేళ తీసుకున్న వీడియోలు, చిత్రాలను రహస్యంగా తీసుకున్న సాగర్, వాటిని చూపించి బెదిరిస్తూ, పెద్దమొత్తంలో డబ్బు, నగలు వసూలు చేశాడు. డబ్బులివ్వకుంటే వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని వేధించేవాడు. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం అతనికి రోడ్డు యాక్సిడెంట్ జరుగగా, తీవ్రగాయాల పాలయ్యాడు. దీంతో అతని పీడ సుప్రియకు వదిలింది.

ఆపై కొన్నాళ్లకు చిత్రదుర్గ పట్టణానికి చెందిన సుబానీ షరీఫ్ అనే యువకుడు సోషల్ మీడియా ద్వారా సుప్రియకు పరిచయం అయ్యాడు. తన పేరు సుబ్బు అని చెప్పి పరిచయం పెంచుకుని, ప్రేమ పేరిట ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. అతను కూడా సన్నిహిత సమయాల్లో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు దిగాడు. ఈ విషయం సుప్రియ తల్లిదండ్రులకు తెలియడంతో, వారు పరువు పోతుందని భావించి, షరీఫ్ అడిగినంత డబ్బులు ఇచ్చారు.

అప్పటికీ తృప్తి చెందని షరీఫ్, మరిన్ని డబ్బుల కోసం సుప్రియ తల్లిదండ్రులను బెదిరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో తాను చేసిన తప్పులకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని భావించిన సుప్రియ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొనగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించి, శివమొగ్గలో షరీఫ్ ను అరెస్ట్ చేశారు.

More Telugu News