Nirbhaya: నిర్భయ దోషులకు టైమొచ్చింది... ఆదివారమైనా నేడు కోర్టులో విచారణ!

  • పదేపదే ఉరి అమలు వాయిదా
  • చట్టాల్లోని లొసుగులే అడ్డం
  • ఉరిపై స్టేకు వ్యతిరేకంగా కేంద్రం పిటిషన్
  • నేడు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ

దేశ చట్టాల్లోని లొసుగులను అడ్డుపెట్టుకుని పదేపదే ఉరిశిక్ష అమలును వాయిదా వేయించుకుంటున్న నిర్భయ దోషులపై కేంద్రం సీరియస్ అయింది. వాస్తవానికి దోషులు నలుగురినీ తీహార్ జైల్లో శనివారం నాడు ఉరితీయాల్సి వుండగా, ఓ దోషి పెట్టుకున్న పిటిషన్ పై విచారించిన పటియాలా హౌస్ కోర్టు, ఉరిపై శుక్రవారం నాడు స్టే విధించిన సంగతి తెలిసిందే.

దీన్ని తీవ్రంగా తీసుకున్న కేంద్రం, స్టేకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు, తీహార్ జైలు అధికారులు, దోషులకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. ఈ కేసు విచారణను సెలవు దినమైనా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చేపడతామని వెల్లడించింది.

కాగా, నిర్భయ దోషులను తక్షణం ఉరితీయాలని దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. వీరికి శిక్ష అమలుపై తప్పు మీదంటే, మీదని కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలోనే ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న నలుగురికీ శిక్ష అమలు తప్పదని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

More Telugu News