Union Budget 2020: కేంద్రం మాట నమ్మితే.. శంకరగిరి మాన్యాలే దిక్కు!: సీఎం కేసీఆర్

  • 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల రాష్ట్రానికి నిధుల కోత
  • గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.3,731కోట్లు తగ్గాయి
  • నిధుల కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపింది

కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ సీఎం వ్యాఖ్యానిస్తూ.. ప్రతిపాదనలన్నీ నిరాశాజనకంగా ఉన్నాయన్నారు. నిధుల కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో భారీ కోత విధించిందన్నారు. కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సీనియర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్రం చేసిన కేటాయింపులు రాష్ట్ర పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం బాధాకరమన్నారు.

కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడుతుందన్నారు. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించిందంటూ.. దీనివల్ల రాష్ట్రానికి రూ.2,381 కోట్ల నిధులు తగ్గుతాయని తెలిపారు. కేంద్రం చెప్పే మాటకు, ఇచ్చే నిధులకు పొంతన లేకుండా పోతోందంటూ.. కేంద్రం మాట నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడిందని సీఎం వ్యాఖ్యానించారు.  

2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.3,731 కోట్లు తగ్గాయని చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా తగ్గించటం కేంద్రం అసమర్థతని చెప్పుకొచ్చారు. ‘2020-21 బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ రాష్ట్రానికి రెండు రకాల నష్టం వాటిల్లింది. రాష్ట్రాలకు కేంద్రం చెల్లించే పన్నుల వాటాను 42 శాతం నుంచి 41శాతానికి తగ్గిస్తున్నారు’ అని కేసీఆర్ అన్నారు.  

More Telugu News