Union Budget 2020: కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిరాశే ఎదురైంది: ఆర్థిక మంత్రి బుగ్గన

  • విభజన హామీలు పెండింగ్ లో పడటం ఇబ్బందికర పరిస్థితి
  • ‘ప్రత్యేక హోదా’ ఆంధ్రప్రదేశ్ హక్కు
  • ఏపీలో రెవెన్యూలోటు భర్తీకీ హామీ లేదు!

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిరాశే ఎదురైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విభజన హామీలు పెండింగ్ లో పడటం రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితి అని అన్నారు. ‘ప్రత్యేక హోదా’ ఆంధ్రప్రదేశ్ హక్కు అని, దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ లేదని విమర్శించారు. అదేవిధంగా ఏపీలో రెవెన్యూలోటు భర్తీ చేయాలని కోరామని, దీనిపైనా ఎలాంటి హామీ రాలేదని, వెనుకబడిన 7 జిల్లాలకు నిధుల ప్రస్తావన లేదని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రీయింబర్స్ మెంట్ ల జాప్యంపై, రామాయపట్నం ప్రాజెక్టుపై ఈ బడ్జెట్ లో ఎలాంటి హామీ ఇవ్వలేదని విమర్శించారు.

కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలో ఉన్న జీడీపీలో 10 శాతం పెరుగుదల అంచనా ప్రశ్నార్థకమేనని బుగ్గన అభిప్రాయపడ్డారు. సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పులు చూపిస్తున్నారని, పెట్టుబడుల ఉపసంహరణతో రూ.2.1 లక్షల కోట్ల ఆదాయం ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. అప్పులు ఎక్కడి నుంచి తెస్తారో సరిగా చెప్పలేదని విమర్శించిన బుగ్గన, అప్పులు మరింత పెరిగి రూ.9 లక్షల కోట్లకు చేరవచ్చని అభిప్రాయపడ్డారు.
 
‘ట్యాక్స్ హాలిడే’ను ఆహ్వానిస్తున్నాం

వ్యవసాయ గోదాముల సామర్థ్యం పెంచేందుకు అప్పు చేయడం, స్వయం సహాయ బృందాలకు 'ముద్ర' రుణాలు ఇవ్వడం, రూ.5 కోట్ల వరకు నిర్వహించే చిన్న వ్యాపారాలను ఆడిట్ కు దూరంగా పెట్టాలన్న బడ్జెట్ లో ప్రతిపాదనలు మంచివేనని బుగ్గన అన్నారు. ‘ఆయుష్మాన్ భారత్’ కింద జిల్లాల్లో ఆస్పత్రుల నిర్మాణం మంచి పరిణామంగా అభివర్ణించిన ఆయన, వ్యాపార వృద్ధికి కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయని ప్రశంసించారు. వ్యక్తిగత, కార్పొరేట్ పన్నులతో వ్యాపారాల వృద్ధికి చర్యలు చేపట్టాలన్న బడ్జెట్ లో ప్రతిపాదన బాగుందని, ‘ట్యాక్స్ హాలిడే’ను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News