Sophia Kenin: టెన్నిస్ ప్రపంచంలో సరికొత్త తార ఉదయించింది!

  • ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా సోఫియా కెనిన్  
  • ఫైనల్లో ముగురుజాపై అద్భుత విజయం  
  • తొలి సెట్ ఓడినా పుంజుకున్న కెనిన్

అంతర్జాతీయ టెన్నిస్ రంగంలోకి మరో సంచలనం దూసుకొచ్చింది. అమెరికా అమ్మాయి సోఫియా కెనిన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ చేజిక్కించుకుంది. ఓ అనామకురాలిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అడుగుపెట్టి కోకో గాఫ్, ఆష్లే బార్టీ వంటి స్టార్ ప్లేయర్లను ఓడించి ఏకంగా విజేతగా నిలిచింది. ఇంతజేసీ సోఫియా వయసు 21 ఏళ్లు మాత్రమే. ఇవాళ జరిగిన ఫైనల్లో కెనిన్ స్పెయిన్ అమ్మాయి గార్బైన్ ముగురుజాపై అద్వితీయ పోరాటంతో మ్యాచ్ నెగ్గింది. తొలి సెట్ లో 4×6 తో వెనుకబడినా ఆపై అద్భుతంగా పుంజుకుని 6×2, 6×2తో విజయం సాధించింది.

రష్యాలో జన్మించిన సోఫియా కెనిన్ అమెరికాలో స్థిరపడింది. గతంలో ఏనాడూ గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ దాటని ఈ చిన్నది ఆస్ట్రేలియన్ ఓపెన్ లో తిరుగులేని ప్రదర్శనతో ఆకట్టుకుంది. టోర్నీ ఆరంభమయ్యే సమయానికి 12వ ర్యాంకులో ఉన్న సోఫియా కెనిన్ తనకంటే మెరుగైన ర్యాంకర్లను ఇంటికి పంపి టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. ప్రైజ్ మనీ కింద సోఫియాకు దాదాపు రూ.20 కోట్ల నగదు లభించనుంది.

More Telugu News