Ap Endowments: దేవాదాయ శాఖ భూముల్లో అక్రమాలు... ఇద్దరు అధికారుల సస్పెన్షన్: ఏపీ మంత్రి వెల్లంపల్లి

  • ఒకరు లంగరుఖానా సత్రం ఈవో
  • మరొకరు విశాఖపట్టణం అసిస్టెంట్‌ కమిషనర్‌ 
  • దేవాదాయ భూముల పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయం

దేవాదాయ శాఖ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్టు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. లంగరుఖానా సత్రం ఈవోను, విశాఖపట్టణం అసిస్టెంట్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.

భీమిలిలోని లంగరుఖానా సత్రం భూముల వేలం వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. భీమిలిలో రూ.300 కోట్ల దేవాదాయ భూముల టెండర్‌ (లీజు) వ్యవహారంపై తమకు మూడు రోజుల కిందటే సమాచారం రావడంతో వేలం వాయిదా వేశామని, ఉన్నతాధికారులతో విచారణ జరిపించి నివేదిక కోరినట్టు తెలిపారు. ఈ నివేదిక తమకు అందిందని, దీని ఆధారంగా ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చినట్టు వివరించారు.

దేవాదాయ భూముల పరిరక్షణ తమ ప్రభుత్వ ధ్యేయమని, ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఎక్కడ తప్పు జరిగినా తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పారదర్శక పాలనకే తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని,  దేవాలయాల భూముల విషయమై అక్రమాలు చోటుచేసుకున్న సంఘటనలు తమ దృష్టికి వస్తే ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందని తెలిపారు.

More Telugu News