Cricket: సూపర్ ఓవర్లో.. కివీస్ పై భారత్ సూపర్ గెలుపు

  • ఒక బంతి మిగిలివుండగానే గెలుపును అందుకున్న భారత్
  • ఐదు టీ20ల సిరీస్ లో 4-0తో ఆధిక్యం
  • మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా శార్దూల్ ఠాకూర్

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరుసగా రెండో మ్యాచ్ టై అయింది. ఈ రోజు వెల్లింగ్టన్ లో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్ లో స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. తొలుత సూపర్ ఓవర్ ఆడిన కివీస్ 13 పరుగులు చేయడంతో అనంతరం 14 పరుగుల గెలుపు లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత కెప్టెన్ కోహ్లీ, రాహుల్ లు సౌథీ బౌలింగ్ ను వీరబాదుదు బాది భారత్ కు గెలుపు అందించారు.

ఓవర్ తొలి బంతిని సిక్సర్ గా మలిచిన రాహుల్ రెండో బంతిని బౌండరీగా బాదాడు. కానీ మూడో బంతిని కూడా  భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ చివరి మూడు బంతుల్లో నాలుగు పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులోకి కొత్త బ్యాట్స్ మన్ గా శాంసన్ వచ్చాడు. కానీ స్ట్రైకింగ్ ను కోహ్లీ తీసుకున్నాడు. సౌథీ వేసిన నాలుగో బంతికి కోహ్లీ తెలివిగా ఆడి రెండు పరుగులు తీశాడు. చివరి రెండు బంతుల్లో.. రెండు పరుగుల లక్ష్యం... స్టేడియంలో ఉత్కంఠ..  ఓవర్ ఐదో బంతిని కోహ్లీ బౌండరీ బాది భారత్ కు విజయాన్ని అందించాడు.  దీంతో భారత్ నాలుగో టీ20లో కూడా విజయం సాధించింది.  ఐదు టీ20ల సిరీస్ లో భారత్ 4-0 ఆధిక్యాన్ని సాధించింది.  అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ చేపట్టింది. బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా భారత్ 8 వికెట్లకు 165 పరుగులు చేసింది. భారత జట్టులో మనీష్ పాండే అర్ధ శతకంతో ఆకట్టుకోగా, ఓపెనర్ రాహుల్ 39 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 20 పరుగులు చేశాడు.

అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసింది. కివీస్ చివరి ఓవర్ లో 7 పరుగులు అవసరం కాగా, శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి కివీస్ ను కట్టడి చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు తీయాల్సిన స్థితిలో ఆ జట్టు ఒక్క పరుగు మాత్రమే తీయడంతో మ్యాచ్ టై అయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును శార్దూల్ ఠాకూర్ అందుకున్నాడు.

More Telugu News