'సరిలేరు నీకెవ్వరు' చిత్రంపై సూపర్ స్టార్ కృష్ణ వ్యాఖ్యలు

31-01-2020 Fri 12:34
  • సంక్రాంతి సీజన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం
  • చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయిందన్న సూపర్ స్టార్ కృష్ణ
  • ఇంకా మరిన్ని రోజులు ఆడే సత్తా ఉందని వెల్లడి

సంక్రాంతి బరిలో విడుదలైన చిత్రాల్లో మహేశ్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం అద్భుత విజయాన్నందుకుంది. యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీనిపై సూపర్ స్టార్ కృష్ణ స్పందించారు. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయిందని చెప్పారు. దర్శకుడు, నిర్మాత ఈ విజయాన్ని 'బ్లాక్ బస్టర్ కా బాప్' (బ్లాక్ బస్టర్ కు అబ్బలాంటి సినిమా) అని పేర్కొనడం చాలా బాగుందని అన్నారు. ఈ సినిమా ఇంకా మరిన్ని రోజుల పాటు ఆడుతుందన్నది తన అభిప్రాయమని కృష్ణ వెల్లడించారు. సినిమా అంత అమోఘంగా ఉందన్నారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా డబ్బు ఖర్చుపెట్టారని, దర్శకుడు కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా బాగా తీశాడని కితాబిచ్చారు.