N Shankar: సినీ దర్శకుడు శంకర్ కు భూమి కేటాయించడంపై కేసీఆర్ సర్కారుకు హైకోర్టు నోటీసులు!

  • మోకిల్ల గ్రామ సమీపంలో ఐదు ఎకరాలు
  • ఎకరా రూ. 5 లక్షలకే అప్పగింత
  • హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం

సినీ దర్శకుడు, నిర్మాత ఎన్.శంకర్ కు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మోకిల్ల గ్రామ సమీపంలో ఎకరం రూ. 5 లక్షల చొప్పున, ఐదు ఎకరాల భూమిని కేటాయించడంపై తెలంగాణ సర్కారుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత సంవత్సరం జూన్ 21న జీవో నంబర్ 75 ద్వారా ఈ భూ కేటాయింపు జరుగగా, జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి దీన్ని అడ్డుకోవాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డిల ధర్మాసనం, రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి, హెచ్ఎండీఏ, రంగారెడ్డి కలెక్టర్, సీసీఎల్ఎం, శంకర్ లకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ల దాఖలుకు 4 వారాల గడువునిచ్చింది. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ విలువ ఎకరాకు రూ. 20 లక్షల వరకూ ఉందని, మార్కెట్ విలువ రూ. 5 కోట్లకు పైమాటేనని తెలిపారు.

More Telugu News