Rohit Sharma: ఆ సమయంలో బుమ్రా తప్ప మరో అవకాశం లేదు: రోహిత్ శర్మ

  • నిన్నటి మ్యాచ్ లో సూపర్ ఓవర్ ద్వారా గెలిచిన టీమిండియా
  • సూపర్ ఓవర్ వేసిన బుమ్రా
  • చితకబాదిన కివీస్
  • అంతకుముందు కూడా భారీగా పరుగులిచ్చిన బుమ్రా
  • ఎటూ తేల్చుకోలేక బుమ్రాతో బంతులేయించామన్న రోహిత్

న్యూజిలాండ్ జట్టుతో నిన్న జరిగిన మూడో టి20 మ్యాచ్ లో సూపర్ ఓవర్ ద్వారా టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ పుణ్యమాని భారత్ అనూహ్య విజయం అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

 రెగ్యులర్ ఇన్నింగ్స్ లో 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్టూ తీయలేకపోయిన బుమ్రా ఏకంగా 45 పరుగులిచ్చుకున్నాడు. భారత ప్రధాన పేసర్ అయిన బుమ్రా బౌలింగ్ ను కివీస్ చీల్చిచెండాడారు. అయితే అందరినీ విస్మయానికి గురిచేస్తూ కోహ్లీ సూపర్ ఓవర్ లో బౌలింగ్ చేసే బాధ్యతను బుమ్రాకే అప్పగించాడు.

దీనిపై టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. వాస్తవానికి సూపర్ ఓవర్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, ఆ రోజు మ్యాచ్ లో ఎవరు మెరుగైన ప్రదర్శన కనబరిస్తే వాళ్లనే బరిలో దించుతారని, కానీ తమకు బుమ్రా తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించలేదని వెల్లడించాడు.

అప్పటికప్పుడు ప్లాన్ చేసేంత సమయం లేకపోవడంతో, యార్కర్లు, స్లో బంతులతో కట్టడి చేయగలిగే సామర్థ్యమున్న బుమ్రాను సూపర్ ఓవర్ బరిలో దించామని చెప్పాడు. ఓ దశలో షమీ, జడేజాలలో ఒకర్ని పంపిద్దామని అనుకున్నామని, అయితే ఎటూ తేల్చుకోలేక బుమ్రాకు బంతి ఇచ్చామని రోహిత్ వివరించాడు. అయితే ఆ సూపర్ ఓవర్లోనూ న్యూజిలాండర్లు బుమ్రాను చితకబాదారు. దాంతో 17 పరుగులు వచ్చాయి.

అంతకుముందు, మహ్మద్ షమీ న్యూజిలాండ్ ను చివరి ఓవర్లో అద్భుతంగా కట్టడి చేయడంతో సూపర్ ఓవర్ ను అతడితోనే వేయిస్తారని అందరూ భావించారు. కానీ కోహ్లీ నిర్ణయం అటు క్రికెట్ పండితులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

More Telugu News