New Delhi: ఢిల్లీలో ముగిసిన అఖిలపక్ష సమావేశం... మీడియాకు వివరాలు వెల్లడించిన విజయసాయి

  • ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష భేటీ
  • హాజరైన వైసీపీ ఎంపీలు
  • రాష్ట్రానికి రావాల్సిన నిధులను కోరామన్న విజయసాయి

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా అఖిలపక్ష సమావేశంలో అనేక అంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.18,969 కోట్ల రెవెన్యూ లోటు నిధులను  అడిగామని తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి సాయం కింద రావాల్సిన రూ.23,300 కోట్ల నిధుల విషయాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, ఇప్పటికే ఈ ప్రాజెక్టు జాతీయ హోదా దక్కించుకుంది కాబట్టి, దానికి కేంద్రం నుంచి రూ.3,283 కోట్లు రీయింబర్స్ మెంట్ రూపంలో రావాల్సి ఉందని తెలిపామని, పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లను కేంద్రం ఆమోదించాలని కోరామని వివరించారు.

రాజధాని నగర అభివృద్ధి కోసం ఇప్పటివరకు కేంద్రం నుంచి రూ.2500 కోట్లు మాత్రమే వచ్చాయని, ఇంకా రూ.47,424 కోట్లు అందించాలని విజ్ఞప్తి చేసినట్టు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంతేగాకుండా, దుగరాజపట్నం వీలుకాదని కేంద్రం చెప్పింది కాబట్టి రామాయపట్నం పోర్ట్ ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయాలని, కడప స్టీల్ ప్లాంట్ కు ఆర్థికసాయం అందించాలని కూడా కేంద్రాన్ని అభ్యర్థించామని అన్నారు.

More Telugu News