Lamborghini Huracan Evo RWD: భారత మార్కెట్లోకి.. లంబోర్ఘినీ లగ్జరీ కారు ‘హురాకాన్‌ ఈవో రియర్‌ వీల్‌ డ్రైవ్‌’!

  • వీ10 ఇంజన్‌తో.. 610 హెచ్‌పీ శక్తి విడుదల
  • 3.3 సెకన్లలోనే 0-100 కిలో మీటర్ల వేగం
  • దేశ వ్యాప్తంగా ఎక్స్ షోరూం ధర రూ.3.22 కోట్లు  

ప్రముఖ కార్ల కంపెనీ లంబోర్ఘినీ భారత మార్కెట్లోకి తాజా వేరియంట్ ను ప్రవేశపెట్టింది. ఇటలీకి చెందిన ఈ కంపెనీ లగ్జరీ స్పోర్ట్స్‌ కార్ల  ఉత్పత్తికి పేరుగాంచింది. ‘హురాకాన్‌ ఈవో రియర్‌ వీల్‌ డ్రైవ్‌’ (ఆర్‌డబ్ల్యూడీ) వేరియంట్‌ను విడుదల చేసింది. ప్రత్యేక ఫీచర్లతో ఈ కారు తన ప్రత్యేకతను చాటుతోంది. వీ10 ఇంజన్‌ కలిగిన ఈ కారు 610 హెచ్‌పీ శక్తిని వెలువరుస్తుంది. 3.3 సెకన్లలోనే 0-100 కిలో మీటర్ల వేగాన్ని ఈ కారు అందుకుంటుంది. గరిష్ఠ వేగం గంటకు 325 కిలో మీటర్లు. కాగా, కారు బరువు 1,390 కిలోలు. దీని ధర విషయానికి వస్తే రూ.3.22 కోట్లు (ఎక్స్‌షోరూమ్‌, దేశవ్యాప్తంగా) గా కంపెనీ నిర్ణయించింది.  

ఈ ఏడాదిలో తమ కార్ల అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నట్టు లంబోర్ఘినీ ఇండియా హెడ్‌ శరద్‌ అగర్వాల్‌ తెలిపారు. ‘2020 సంవత్సరానికి మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. పరిశ్రమకన్నా వేగంగా వృద్ధి చెందాలనుకుంటున్నాం. అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. కచ్చితంగా రెండంకెల వృద్ధిని సాధించాలనుకుంటున్నాం’ అని అగర్వాల్‌ పేర్కొన్నారు. హురాకాన్ లో మరో రెండు వేరియంట్లు కూడా లభ్యంకానున్నాయన్నారు. స్సైడర్ వేరియంట్ ధర రూ.4.1 కోట్లు కాగా, ఏడబ్ల్యుడీ ధర రూ.3.73 కోట్లు ఉంటుందన్నారు.

More Telugu News