Adnan Sami: నాకు వచ్చిన పద్మశ్రీ పురస్కారానికి.. నా తండ్రికి ఏం సంబంధం?: అద్నాన్ సమీ

  • అద్నాన్ సమీకి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన కేంద్రం
  • విమర్శలు గుప్పిస్తున్న విపక్ష నేతలు
  • 2016లో భారత పౌరసత్వాన్ని పొందిన సమీ

పాకిస్థాన్ కు చెందిన బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు అద్నాన్ సమీని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. దీనిపై అద్నాన్ సమీ స్పందిస్తూ, ఇది తనకు దక్కిన గొప్ప గౌరవమని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. మరోవైపు తనపై విమర్శలు గుప్పిస్తున్న కొందరు రాజకీయ నాయకులపై ఆయన మండిపడ్డారు.

తనకు అన్ని పార్టీల నాయకులతో పరిచయాలు ఉన్నాయని... కొందరు నేతలు మాత్రం వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వివాదాస్పదం చేయాలనుకుంటున్నారని సమీ విమర్శించారు. అది వారి పొలిటికల్ అజెండా అని... వారి వ్యాఖ్యలను తాను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.

తాను కళాకారుడినని, రాజకీయవేత్తను కాదని చెప్పారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న రాజకీయపరమైన వైరం వల్ల వారు అనేక విమర్శలు గుప్పిస్తుంటారని... తనకు పద్మశ్రీ ఇచ్చిన అంశాన్ని కూడా అజెండాలో ఒక భాగంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

తన తండ్రిని కూడా ఈ వివాదంలోకి లాగడం దారుణమని అద్నాన్ సమీ అన్నారు. సమీ తండ్రి పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా పనిచేశారు. ఈ అంశాన్ని కూడా వివాదంలోకి లాగడంతో సమీ స్పందిస్తూ... తన తండ్రి దేశభక్తి కలిగిన ఒక సైనికుడని చెప్పారు. తన దేశం కోసం ఆయన తన కర్తవ్యాన్ని నిర్వహించారని... తన తండ్రిని చూసి తాను ఎంతో గర్విస్తానని అన్నారు. ఆయన చేసిన పోరాటాలకు ఆయన అవార్డులను స్వీకరించారని.. ఆయన సాధించిన దానితో తాను పొందిందేమీ లేదని చెప్పారు. అదే విధంగా తనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారంతో తన తండ్రి సాధించేది ఏమీ లేదని అన్నారు. ఇదంతా ఒక సంబంధం లేని, అనవసరమైన చర్చ అని దుయ్యబట్టారు.

కళలకు సరిహద్దులు ఉండవని, రాజకీయాల కంటే కళలు ఒక మెట్టు పైనే ఉంటాయని సమీ అన్నారు. కేవలం రాజకీయాల కోసమే తనను వివాదంలోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివాదాల్లోకి కళాకారులను లాగవద్దని విన్నవించారు. తనకు బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల్లో మంచి మిత్రులు ఉన్నారని చెప్పారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తనను నౌషద్ పురస్కారంతో సత్కరించారని సమీ గుర్తు చేశారు. అప్పుడు తాను పాకిస్థాన్ జాతీయుడినని చెప్పారు. ఇప్పుడు తాను భారత పౌరసత్వం కలిగిన వ్యక్తినని, భారతీయుడినని, పద్మశ్రీ పురస్కారాన్ని పొందేందుకు అన్ని అర్హతలు కలిగిన వ్యక్తినని అన్నారు.

మరోవైపు ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మాట్లాడుతూ... సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయని... ఈ నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా అద్నాన్ సమీకి పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించిందని విమర్శించారు.

46 ఏళ్ల అద్నాన్ సమీ 2016లో పాకిస్థాన్ పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరసత్వాన్ని పొందారు. ఆ సమయంలో పాక్ ప్రజల నుంచి ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.

More Telugu News