Uttarakhand: పెళ్లి మండపానికి వెళ్లేందుకు నానాపాట్లూ పడిన వరుడు!

  • ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో ఘటన
  • దట్టంగా మంచు కురవడంతో ఆగిపోయిన రవాణా సౌకర్యాలు
  • నడుస్తూ వధువు ఇంటికి చేరిన వరుడు

పెళ్లి కుదిరింది. మరికొన్ని గంటల్లో పెళ్లి. వధువు ఇంట్లోనే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండపానికి ఇక బయలుదేరదామని సిద్ధమవుతున్నంతలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టంగా మంచు కురవడంతో, సమయానికి వధువు ఇంటికి చేరేందుకు ఆ వరుడు, అతని బంధుమిత్రులు నానా అగచాట్లూ పడాల్సి వచ్చింది.

ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లా బిజ్రాలో జరిగింది. మంచు కారణంగా రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో వధువు ఇంటికి వరుడితో పాటు మిగతావారంతా కాలి నడకన బయలుదేరారు. నాలుగు కిలోమీటర్ల పాటు మంచులో నడుస్తూ వెళ్లాల్సి వచ్చింది. ఎట్టకేలకు వారు ముహూర్తం సమయానికి వధువు ఇంటికి రావడంతో, వివాహం ఆనందోత్సాహాల మధ్య సాగింది. ఇక వరుడు చేసిన సాహసంపై వధువు గ్రామస్థులు పొగడ్తల వర్షం కురిపించారు.

More Telugu News