Visakhapatnam: విశాఖ కార్పొరేషన్ ఎన్నికలపై పిటిషన్ విచారణ రేపటికి వాయిదా

  • నిబంధనల మేరకు వార్డుల పునర్విభజన జరగలేదన్న పిటిషనర్
  • అభ్యంతరాలు చెప్పేందుకు తగు సమయం ఇవ్వలేదని ఆరోపణ
  • ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న ప్రభుత్వ న్యాయవాది
  • 400 అభ్యంతరాల్లో ఒక్కటీ చెప్పకుండా పిటిషన్ వేశారంటూ ప్రత్యారోపణ

విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ నేడు విచారణకు వచ్చింది. వార్డుల పునర్విభజన నిబంధనల మేరకు జరగలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. నిబంధలను అనుసరించి పునర్విభజన జరిపాకే ఎన్నికలు నిర్వహించాలంటూ విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా వార్డుల పునర్విభజన చేశారని పిటిషనర్ ఆరోపించారు. పునర్విభజన వేళ అభ్యంతరాలు, సూచనలు ఇచ్చేందుకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని తెలిపారు. ఇచ్చిన గడువులో 4 రోజులు సెలవులే ఉన్నాయని వెల్లడించారు.

విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారమే తుది నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. దాఖలైన పిటిషన్ కు విచారణ అర్హత కూడా లేదని వాదించారు. 400 అభ్యంతరాల్లో ఒక్కటీ చెప్పకుండా కోర్టులో పిటిషన్ వేశారని ప్రత్యారోపణ చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, ఎన్నికల ప్రక్రియ వివరాలు తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.

More Telugu News