Devineni Uma: మిమ్మల్ని వదిలేది లేదు.... డబ్బుకు ఆశపడి తప్పుడు రిపోర్టులు ఇస్తారా?: దేవినేని ఉమ

  • బీసీజీ, జీఎన్ రావు కమిటీలపై ఉమ ఫైర్
  • ఫీజుల కోసం కక్కుర్తిపడ్డారంటూ ఆగ్రహం
  • తప్పుడు కార్యక్రమాలకు సహకరించవద్దంటూ అధికారులకు హితవు

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. డబ్బుకు ఆశపడి తప్పుడు రిపోర్టులు ఇస్తారా? అంటూ బీసీజీ, జీఎన్ రావు కమిటీలపై మండిపడ్డారు. మీరిచ్చిన తప్పుడు నివేదికల కారణంగా అమరావతిలో 26 మంది రైతులు చనిపోయారని, వారిలో మహిళలు, దళితులు ఉన్నారని అన్నారు.

మిమ్మల్ని వదిలేది లేదు, ప్రజాకోర్టుకు ఈడుస్తాం, హైకోర్టులో నిలబెడతాం అంటూ హెచ్చరించారు. తాతముత్తాలు ఇచ్చిన భూములను ప్రజారాజధాని కోసం, ఐదు కోట్ల మంది ప్రజల కోసం త్యాగాలు చేసిన రైతులు మీరిచ్చిన తప్పుడు నివేదికలు, తప్పుడు కార్యక్రమాల ద్వారా గుండెలు ఆగి చనిపోతున్నారని ఆరోపించారు. ఫీజులకు కక్కుర్తిపడి ఐదు కోట్ల మంది జీవితాలతో ఆడుకుంటున్నారని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"అధికారులు కూడా ఓ విషయం గుర్తెరగాలి. ఏడాది తిరక్కుండా చర్లపల్లి జైలుకెళ్లే వ్యక్తి మాటలు నమ్మి మోసపోవద్దు. విశాఖలో మిలీనియం టవర్స్ లో కొన్ని ప్రభుత్వ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. కొందరు అధికారులు కూడా అక్కడినుంచే పనిచేస్తున్నారు. అలాంటి అధికారులందరూ టేబుళ్లపై గోల్డ్ మెడలిస్ట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి ఫొటో పెట్టుకోవాలి. శ్రీలక్ష్మి ఇప్పటికీ ప్రతి శుక్రవారం ఏ2 విజయసాయిరెడ్డితో పాటు నాంపల్లి సీబీఐ కోర్టు మెట్లెక్కుతున్నారు. ఈ గుణపాఠాలు చూసిన తర్వాతైనా తప్పుడు కార్యక్రమాలకు సహకరించడం మానుకోండి" అంటూ ఉమ హితవు పలికారు.

More Telugu News