Chandrababu: దిష్టిబొమ్మలు తగులబెడుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఇంతకాలం చూశాం!: చంద్రబాబు

  • విశాఖ జిల్లాలో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనానికి వైసీపీ నేతల యత్నం
  • అడ్డుకున్న స్థానిక మత్స్యకార మహిళలు
  • మహిళలకు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు
  • తగిన గుణపాఠం చెప్పారంటూ వ్యాఖ్యలు

విశాఖ జిల్లా వెంకోజీపాలెం పెదజాలరి పేటలో చంద్రబాబు దిష్టిబొమ్మలను వైసీపీ నేతలు దగ్ధం చేస్తుండగా అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. ఎక్కడైనా దిష్టిబొమ్మలు తగులబెడుతుంటే పోలీసులు అడ్డుకోవడం చూశామని, కానీ ప్రజలే ఎదురు తిరిగి దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా నిలువరించి, ఆ నాయకుడి పాలనలో జరిగిన అభివృద్ధిని విడమర్చి చెప్పారని, తద్వారా నిరసనకారులకు కనువిప్పు కలిగించారని చంద్రబాబు వివరించారు. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ఎంత కష్టపడిందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అని పేర్కొన్నారు.

ఒక ప్రభుత్వం వల్ల, ఒక పార్టీ వల్ల తమకు మేలు జరిగితే ప్రజలు మర్చిపోరు అనడానికి విశాఖ జిల్లాలోని పెదజాలరిపేటలో జరిగిన ఈ ఘటన ఓ ఉదాహరణ అని తెలిపారు. నా పాలన గుర్తుంచుకుని, తమ మనసుల్లో నాపై ఇంత అభిమానాన్ని పెంచుకున్న మత్స్యకార అక్కచెల్లెళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. విధ్వంసాలు, కూల్చివేతలు, రద్దుల పద్దులతో దేశవిదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసి, పేదల సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేసిన తుగ్లక్ 2.0లు నా దిష్టిబొమ్మలు కాల్చాలని చూసినా ప్రజలు విజ్ఞులు కాబట్టి ఆ కుట్రలను అడ్డుకుని, తగిన గుణపాఠం చెప్పారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఆయన వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. ఏ విశాఖ గురించి ఈ ప్రభుత్వం మాట్లాడుతోందో, ఆ విశాఖ ప్రజలే తమకింతవరకు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెబుతున్నారంటే అంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదన్నారు.

More Telugu News