Rajinikanth: ప్రపంచ సాహసికుడు బేర్ గ్రిల్స్ కు థ్యాంక్స్ చెప్పిన రజనీకాంత్

  • 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో రజనీ
  • కర్ణాటకలోని బండిపుర అడవుల్లో బేర్ గ్రిల్స్ తో సాహసాలు
  • త్వరలోనే డిస్కవరీ చానల్లో ప్రసారం

ప్రపంచ సాహసికుడు బేర్ గ్రిల్స్ కు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. బేర్ గ్రిల్స్ నిర్వహణలో 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' అనే కార్యక్రమం డిస్కవరీ చానల్ లో ప్రసారమవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. తాజాగా, తలైవా రజనీకాంత్ ను కూడా బేర్ గ్రిల్స్ తన వెంట కొండకోనల్లో తిప్పాడు. ప్రకృతిలో ఎలా మనుగడ సాగించాలో చేసి చూపించాడు. ఈ క్రమంలో రజనీ స్వల్పగాయాలపాలయ్యారు.

అయితే, ఇదో మరుపురాని అనుభవం అని రజనీకాంత్ ట్విట్టర్ లో స్పందించారు. బేర్ గ్రిల్స్ తో 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో భాగంగా అడవుల్లో సంచరించడం అద్భుతమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రజనీ డిస్కవరీ చానల్ కు కూడా ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో బేర్ గ్రిల్స్, రజనీకాంత్ కర్ణాటకలోని బండిపుర అడవుల్లో సాహసాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమం త్వరలోనే డిస్కవరీ చానల్లో ప్రసారం కానుంది.

More Telugu News