Narendra Modi: పాకిస్థాన్ ను సర్వ నాశనం చేసేందుకు వారం చాలు: మోదీ సంచలన వ్యాఖ్యలు

  • మనతో చేసిన మూడు యుద్ధాల్లో పాక్ మట్టికరిచింది
  • అయినా ఆ దేశానికి బుద్ధి రాలేదు
  • గత ప్రభుత్వాలు చేసిన తప్పులను మేము సరిచేశాం

దాయాది దేశం పాకిస్థాన్ ను సర్వ నాశనం చేసేందుకు భారత్ కు వారం నుంచి 10 రోజుల సమయం చాలని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా భారత్ తో పాకిస్థాన్ చేస్తున్న పరోక్ష యుద్ధంలో వేలాది మంది జవాన్లు, ప్రజలు అమరులయ్యారని ఆయన అన్నారు. మనతో చేసిన మూడు యుద్ధాల్లో పాక్ మట్టికరిచిందని చెప్పారు. అయినా ఆ దేశానికి బుద్ధి రాలేదని... తన వంకర బుద్ధిని ఇంకా ప్రదర్శిస్తూనే ఉందని విమర్శించారు.  

పాక్ పరోక్ష యుద్ధాన్ని గత ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోలేదని... కేవలం శాంతిభద్రతల సమస్యగానే దాన్ని చూశాయని మోదీ విమర్శించారు. పాక్ పై దాడి చేస్తామని సైన్యం కోరినా అనుమతించలేదని దుయ్యబట్టారు. పాకిస్థాన్ ను నిలువరించకుండా... సమస్య పెద్దది అయ్యేలా వ్యవహరించారని అన్నారు. కశ్మీర్ సమస్యను 70 ఏళ్లుగా కొన్ని పార్టీలు, కొన్ని కుటుంబాలు సజీవంగా ఉంచాయని... తీవ్రవాదం పెరగడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను తాము సరి చేశామని అన్నారు.

నెహ్రూ-లియాకత్ అలీ ఖాన్ ఒప్పందంలో ఉన్నదాన్నే ఇప్పుడు సీఏఏ రూపంలో తాము అమలు చేస్తున్నామని మోదీ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో బాధపడుతున్న ముస్లిమేతరులు ఎప్పుడైనా భారత్ కు రావచ్చనేది ఆ ఒప్పందంలో ఉందని చెప్పారు. మహాత్మాగాంధీ ఆశయం కూడా ఇదేనని అన్నారు. పాక్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లలో ఇబ్బంది పడుతున్న మైనార్టీలకు ఆశ్రయం ఇవ్వడానికే సీఏఏను తెచ్చామని తెలిపారు.

More Telugu News