USA: కాల్ సెంటర్ ఫ్రాడ్... ముగ్గురు భారతీయులకు అమెరికాలో జైలు శిక్ష!

  • ఇండియాలో కాల్ సెంటర్ ఏర్పాటు
  • అమెరికన్లకు కాల్ చేసి బెదిరింపులు
  • మొత్తం ఎనిమిది మందికి జైలుశిక్ష

కాల్ సెంటర్ పేరిట 37 లక్షల డాలర్ల (సుమారు రూ. 26.36 కోట్లు) మోసానికి పాల్పడిన కేసులో అమెరికాలో ముగ్గురు ఇండియన్స్ సహా ఎనిమిది మందికి జైలు శిక్ష పడింది. భారత్ కేంద్రంగా జరిగిన కాల్ సెంటర్ ఫ్రాడ్ గత సంవత్సరం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మోసంలో నష్టపోయింది అమెరికన్లే.

ఈ కేసులో జార్జియాలో నివాసం ఉంటున్న మొహమ్మద్‌ కాజిమ్‌ మొమిన్, మొహమ్మద్‌ సోజబ్‌ మొమిన్, పాలక్‌ కుమార్‌ పటేల్‌ లను అరెస్ట్ చేసిన అధికారులు, వారిపై చార్జ్ షీట్ దాఖలు చేయగా, కోర్టు విచారణ జరిపింది. వీరికి ఆరు నెలల నుంచి నాలుగు సంవత్సరాల 9 నెలల వరకు వేర్వేరుగా జైలు శిక్షలు విధించింది.

డేటా బ్రోకర్ల నుంచి సమాచారం తీసుకుని, వారికి ఫోన్ చేసి, తాము ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసెస్‌ ఉద్యోగులమని, మీరు ప్రభుత్వ పన్నులు చెల్లించలేదని, భారీ జరిమానా పడుతుందని భయపెట్టి, వారి నుంచి డబ్బులు వసూలు చేసేవారు. ఇందుకోసం అహ్మదాబాద్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని, ఇండియాలోని కొందరితో కలసి కుట్ర చేసి ఈ మోసానికి తెరలేపారని ప్రాసిక్యూషన్ కోర్టులో రుజువు చేసింది.

More Telugu News