Uttam Kumar Reddy: ఎన్నికలకు భయపడి వాయిదా కోరలేదు: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

  • వార్డు రిజర్వేషన్స్ కు, నామినేషన్స్ తొలి రోజుకు మధ్య గ్యాప్ కోరాం  
  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎందుకు తొందర పడ్డారో అర్థం కాలేదు
  • మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ లిక్కర్, మనీగా జరిగాయి

టీపీసీసీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయమని కోరలేదని చెప్పారు. తామేదో ఎన్నికలకు భయపడి వాటిని వాయిదా వెయ్యాలని కోరుతూ కోర్టుకు వెళ్లామని టీఆర్ఎస్ శ్రేణులు విమర్శించడం తగదన్నారు. తాము కూడా ప్రతి విమర్శలు చేయగలమంటూ  ఉత్తమ్ పేర్కొన్నారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన రోజే... వార్డు రిజర్వేషన్స్ కు, నామినేషన్స్ తొలి రోజుకు మధ్య ఒక వారం గ్యాప్ ఉండాలని వినతి చేశామన్నారు. కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎందుకు తొందర పడ్డారో అర్థం కాలేదని వ్యాఖ్యానించారు.

వార్డు రిజర్వేషన్స్ ప్రకటనకు, నామినేషన్లకు మధ్య ఒక్క రోజే ఉండటంతో.. రిజర్వేషన్ల ప్రకటన వెనక్కి తీసుకుపోవడమో లేదా నామినేషన్లను ముందుకు జరపడమో చేయాలని కోరామని వివరించారు. నేరేడుచర్లలో అధికార దుర్వినియోగం జరిగిందన్నారు. తెలంగాణలో న్యాయస్థానాలపై ప్రజలకు విశ్వాసం తగ్గిపోతోందని ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ విషయంలో కొన్ని విషయాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళతామని చెప్పారు.  

మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ, అధికార దుర్వనియోగం జరిగాయన్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఈ తరహా తీరు కనిపించలేదన్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ లిక్కర్, మనీగా జరిగాయని ఆయన అభివర్ణించారు. అభ్యర్థులను బెదరించడం, కొనుగోలు చేయడం జరిగిందని ఆరోపించారు. అధికార టీఆర్ఎస్ తీరుతో తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు.

More Telugu News