Telugudesam: అమరావతి అంశం చాలా ముఖ్యమైంది: ఎంపీ గల్లా జయదేవ్

  • రైతుల దీక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
  • పోలీసులపై నేను రాళ్లు రువ్వలేదు
  • ఆ పని చేసింది మఫ్టీలో ఉన్న పోలీసులే

విజయవాడలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) సమావేశం ముగిసింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, పార్లమెంట్ లో బడ్జెట్ సెషన్స్ ఫస్ట్ ఫేజ్ ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి11 వరకు, సెకండ్ ఫేజ్ మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్నట్టు చెప్పారు.

రాజధాని అమరావతిని మార్చే ప్రసక్తే లేదని వైసీపీ నేతలు గతంలో చాలాసార్లు చెప్పారని, మారుస్తామని తమ మేనిఫెస్టోలో జగన్ పెట్టలేదని గుర్తుచేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి విఫలమయ్యామని దక్షిణాఫ్రికా నేతలే చెబుతున్నారని గుర్తుచేశారు.

రాజధాని గురించి జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదని విమర్శించారు. రైతుల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదని న్యాయస్థానాలు కూడా ప్రశ్నిస్తున్నాయని అన్నారు. అమరావతి అంశం చాలా ముఖ్యమైందని, నలభై రెండు రోజులుగా రాజధాని రైతులు చేస్తున్న దీక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

శాంతియుత పద్ధతిలో ఇటీవల ‘ఛలో అసెంబ్లీ’ నిర్వహిస్తున్న రైతులపై, తనపై పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని విమర్శించారు. పోలీసులపై తాను రాళ్లు రువ్వానని తనపై కేసు పెట్టారని, ఆ పని తాను గానీ, తనతో ఉన్న రైతులు గానీ చేయలేదని మరోమారు స్పష్టం చేశారు. మఫ్టీలో ఉన్న పోలీసులే ఈ పని చేశారని ఆరోపించారు. ఆ రోజున తన వెనుక నుంచి ఒక మట్టిగడ్డను ఎవరో విసిరి వేశారని, ఈ పని ఎవరు చేశారని వెనక్కి తిరిగి తమ వాళ్లను అడిగానని, తాము చేయలేదని వాళ్లు సమాధానం చెప్పారని గుర్తుచేసుకున్నారు.

More Telugu News