Hyderabad: నీ ఇష్టం.. కట్నం తెస్తావో.. విడాకులిస్తావో!: భార్యకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అల్టిమేటం

  • అత్తమామలు, ఆడపడుచుతో కలిసి వేధింపులు
  • అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి
  • లేకుంటే ఆమె కుటుంబ సభ్యులను అభాసుపాలు చేస్తామని బెదిరింపు

పది లక్షల రూపాయల నగదు, 28 తులాల బంగారం, మూడెకరాల పొలాన్ని కట్నంగా తీసుకున్నా అతడి కట్న దాహం చల్లారలేదు. మరింత కట్నం కావాలంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పలు నిందలు మోపాడు. అతడి వేధింపులు భరించలేని భార్య పుట్టింటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం.. కానూరుకు చెందిన పొర్లికొండ నాగ వెంకట హైందవి, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మిరదొడ్ల రఘురామ్ భార్యాభర్తలు.

ఐదేళ్ల క్రితం వీరి వివాహం కాగా, రూ.10 లక్షల నగదు, రూ.28 తులాల బంగారం, మూడెకరాల పొలాన్ని కట్నంగా తీసుకున్నాడు. పెళ్లైన కొన్నాళ్లకే రఘురామ్, అత్తమామలు, ఆడపడుచు హైందవిని వేధించడం మొదలుపెట్టాడు. ఉద్యోగం మానేయాలని, పుట్టింటి వారితో మాట్లాడొద్దని వేధిస్తూ అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి తీసుకొచ్చేవారు. తీసుకురాకుంటే పుట్టింటివారిపైనా నిందలు వేసి బజారుకీడుస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆమెను బెదిరించి విడాకుల పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు.

వారి వేధింపులకు తాళలేని హైందవి పుట్టింటికి చేరుకుంది. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో భర్త రఘురామ్, అత్త శుభవాణి, మామ సుబ్రహ్మణ్యం, ఆడపడుచు హారిక, ఆమె భర్త గోవర్ధనరావులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News