Pawan Kalyan: ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలను తొలగించడం.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: పవన్ కల్యాణ్

  • రాజ్యాంగ కర్తలు ముందుచూపుతో ద్విసభల ఏర్పాటు సూచించారు
  • మండలి రద్దుతో మేధావుల ఆలోచలను కోల్పోయాం 
  • వికేంద్రీకరణ బిల్లు నిలిచిపోతే మండలి రద్దు చేస్తారా?

 ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభ ఆమోదించడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. ఇది సరైన చర్య కాదన్నారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ.. పవన్ ఓ ప్రకటన చేశారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందుచూపుతో రాష్ట్రాల్లో రెండు సభల ఏర్పాటుకు అవకాశం కల్పించారన్నారు. శాసన సభలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. దానిపై పెద్దల సభలో మేధోపరమైన చర్చచేయాలన్న ఉన్నతాశయంతో శాసన మండలి ఏర్పాటైందని అన్నారు.

వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో పునరుద్ధరించిన మండలిని రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రద్దు చేయడం సబబు కాదన్నారు. మండలి రద్దుతో మేధావుల ఆలోచలను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించే అవకాశాన్ని మనం కోల్పోయామన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యవస్థలను తొలగించుకుంటూ పోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. వికేంద్రీకరణ బిల్లు నిలిచిపోతే ఏకంగా మండలినే రద్దు చేయడం సహేతుకంగా లేదన్నారు. మండలి రద్దుకు ప్రజామోదాన్ని పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు.

More Telugu News