Janasena: ఎన్ఆర్సీపై అపోహలు తొలగించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం: ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్

  • సీఏఏ, ఎన్ఆర్సీ వల్ల భయాలు వద్దు
  • కొంతమంది ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొడుతున్నారు
  • క్రియాశీలక కార్యకర్తలతో పవన్ సమావేశం

భారత దేశంలోని ప్రతి పౌరుడికి జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ) వర్తిస్తుందని, కేవలం ముస్లింల కోసం మాత్రమే పెట్టింది కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ‘జనసేన’ కార్యాలయంలో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తలు హాజరయ్యారు. పశ్చిమ నియోజకవర్గంలోని సమస్యలతో పాటు రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న పరిస్థితులపై వారి అభిప్రాయాలను అడిగి పవన్ తెలుసుకున్నారు.  

అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీ ల వల్ల పౌరసత్వం తీసేస్తారని ప్రజలు భయపడొద్దని సూచించారు. మత ప్రాతిపదికన ప్రజలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి ముస్లిం సోదరుల్లో ఉన్న భయాలు, అపోహలను తొలగించేందుకు ప్రత్యేకంగా ఓ సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. న్యాయ నిపుణులతో వారి సందేహాలు నివృత్తి చేస్తామని చెప్పారు.

ప్రభుత్వాలు మారినప్పుడు తమ విధానానికి అనుగుణంగా వివరాలు సేకరిస్తాయని అన్నారు. గతంలో తెలంగాణలో ‘సకల జనుల సర్వే’ నిర్వహించినప్పుడు ఆంధ్రా వారిని సెపరేట్ చేయడానికే అన్న అపోహలు తలెత్తాయని, అలాగే, ‘ఆధార్’ కోసం కేంద్ర ప్రభుత్వం వివరాలు కోరినప్పుడు కూడా చాలా మందికి పలు సందేహాలు వచ్చాయని గుర్తుచేశారు.

More Telugu News