Jagan: ఈ దిక్కుమాలిన మండలికి ఒక్క రూపాయి ఖర్చు చేయడం కూడా దండగే: సీఎం జగన్

  • అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం
  • గతంలో విద్యావంతులు, మేధావుల కోసం సభ ఏర్పాటు చేశారని వెల్లడి
  • ఇప్పుడు అసెంబ్లీలో కూడా విద్యాధికులు, మేధావులు ఉన్నారన్న వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (2) ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని క్యాబినెట్ నేరుగా అసెంబ్లీకి జవాబుదారీగా ఉంటుందని తెలిపారు. ఎందుకంటే ఇది ప్రజలు ఎన్నుకున్న సభ అని స్పష్టం చేశారు.

"రాజ్యాంగ నిర్మాతలు మండలి తప్పనిసరి అని భావించి ఉంటే ప్రతి రాష్ట్రంలోనూ రద్దు చేయడానికి వీల్లేని విధంగా రూపొందించి ఉండేవాళ్లు. అలాకాకుండా రెండో సభను ఆప్షనల్ గా రాష్ట్ర శాసనసభ నిర్ణయానికే వదిలేసి ఆర్టికల్ 169 ప్రకారం మండలి రద్దు అధికారాలను కూడా రాష్ట్ర అసెంబ్లీకే ఇచ్చింది. విద్యావంతుల సంఖ్య అతి తక్కువగా ఉన్న రోజుల్లో, మేధావులు, ఉన్నత విద్యావంతులకు అవకాశం కల్పించేందుకే మండలి ఏర్పాటు అవకాశం కల్పించారు. నేటి శాసనసభలో అలాంటి దుస్థితి లేదు. ఇదే అసెంబ్లీలో ముగ్గురు పీహెచ్ డీలు, 38 పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 13 మంది డాక్టర్లు, 14 మంది ఇంజినీర్లు, 68 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అధికారులున్నారు, ఇద్దరు గ్రూప్-1 అధికారులు, ఒక జర్నలిస్ట్, ఒక ప్రొఫెసర్, ఇద్దరు ఉపాధ్యాయులు, రైతులు కూడా ఉన్నారు. వీళ్లందరూ ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు.

ఇలాంటి నేపథ్యంలో దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో మాత్రమే మండళ్లు ఉన్నాయి. గతంలో ఈ మండళ్ల పనితీరు కారణంగా 'మండళ్లు వద్దు' అని అసోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఉపసంహరించుకున్నాయి. రాష్ట్ర క్యాబినెట్ అసెంబ్లీకే తప్ప మండలికి జవాబుదారీ కాదన్నది వాస్తవం. ఈ క్రమంలో అసెంబ్లీలో వస్తున్న ఏ బిల్లు అయినా కూడా మండలి ముందుకు ఎందుకు వెళ్లాలన్నది ఓ ప్రశ్న. ఇవాళ విపక్షాలు చేస్తున్న దిగజారుడు రాజకీయాలు చూస్తున్న తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం లేదు.

బిల్లులకు మండలిలో సవరణలు చేసి పంపించినప్పుడు వాటిని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరమే లేనప్పుడు మండలితో పనేంటి? ప్రజలతో ఎన్నుకున్న శాసనసభ రూపొందించిన బిల్లులను తాత్కాలికంగా అడ్డుకోవడానికి ఉపయోగపడుతున్న ఇలాంటి మండలిని ఏమనాలి? దీని వల్ల కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలగడం తప్ప ప్రజలకు దీని వల్ల జరిగే మేలు ఏమీలేదు. ప్రజాప్రయోజనం లేని మండలి ఇది. దీనిపై డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ. రాష్ట్ర ఖజానా నుంచి దీనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం అనవసరం. మండలికి దాదాపుగా రూ.60 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ మండలికి ఇంతింత సొమ్ము ఖర్చు  చేయడం ధర్మమేనా? అని ఆలోచించాల్సిన అవసరం ఉంది" అంటూ ప్రసంగించారు.

More Telugu News