Varla Ramaiah: ఆనాటి దుర్యోధనుడి గతే ఈనాటి ముఖ్యమంత్రికి తప్పదని గ్రహించాలి: వర్ల రామయ్య

  • మండలి రద్దు చేయాలని క్యాబినెట్ నిర్ణయం
  • జగన్ నిర్ణయం తీసుకున్న వెంటనే ముగిసిన క్యాబినెట్ సమావేశం
  • ట్విట్టర్ లో ఘాటుగా స్పందించిన వర్ల రామయ్య

ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ పై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మయసభలో భంగపడిన దుర్యోధనుడిలా నేడు శాసనమండలిలో ముఖ్యమంత్రి భంగపడ్డాడని విమర్శించారు. నాడు మయసభను ధ్వంసం చేసిన దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామంలో సర్వనాశనమైతే, సీఎం ఇవాళ మండలిని రద్దు చేసి స్వీయ నాశనాన్ని కొనితెచ్చుకుంటున్నాడని పేర్కొన్నారు.

ఇప్పుడు గనుక ముఖ్యమంత్రి ప్రజాక్షేత్రంలోకి వెళితే ఆనాటి దుర్యోధనుడికి పట్టిన గతే పడుతుందని స్పష్టం చేశారు. ఈ ఉదయం సమావేశమైన ఏపీ క్యాబినెట్ రాష్ట్ర శాసనమండలి రద్దు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్న వెంటనే సమావేశాన్ని ముగించారు. దీనిపైనే వర్ల రామయ్య ట్విట్టర్ లో స్పందించారు.

More Telugu News