TTD: ఖాళీ కానున్న టీటీడీ గోడౌన్... 85 టన్నుల నాణాలను కరిగించాలని నిర్ణయం!

  • సెయిల్ తో కుదిరిన ఒప్పందం
  • మెట్రిక్ టన్నుకు రూ. 29,972 ఇచ్చేలా నిర్ణయం
  • ఇప్పటికే అనుమతిచ్చిన ఆర్థిక శాఖ
  • ఫిబ్రవరి తొలి వారంలో నాణాల తరలింపు

నానాటికీ పెరిగిపోతున్న చిల్లర నాణాల బరువును దించుకునే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ గోడౌన్ లో ఉన్న దాదాపు 85 టన్నుల నాణాలను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)కు పంపించాలని నిర్ణయించింది. సేలంలోని సెయిల్ కర్మాగారానికి ఫిబ్రవరి తొలి వారంలో ఈ నాణాలను పంపుతామని, ఇవన్నీ ప్రస్తుతం చెలామణిలో లేనివేనని అధికారులు తెలిపారు. ఇప్పటికే గోడౌన్ లో చెల్లని నాణాలు అధిక స్థలాన్ని ఆక్రమించాయని తెలిపారు.

2018లో చెల్లుబాటులో ఉన్న నాణాలను 90 వేల బ్యాగుల్లో బ్యాంకులకు పంపిన టీటీడీ, రూ. 30 కోట్ల ఆదాయాన్ని పొందింది. జూలై 2011 తరువాత 25 పైసల కన్నా దిగువన ఉన్న నాణాలన్నీ చెలామణి నుంచి తొలగిన నేపథ్యంలో, టీటీడీ వద్ద ఆ నాణాలు గుట్టలు గుట్టలుగా పేరుకుని పోయాయి. ఈ నాణాలన్నింటినీ కరిగించాలని ఇప్పుడు అధికారులు నిర్ణయించారు.

తొలుత వీటి ముఖ విలువ ఇస్తే చాలని ఆర్బీఐని సంప్రదించామని, నాణాల ఎక్స్ ఛేంజ్ కి వారు అంగీకరించలేదని, ఆపై ముంబైలోని మింట్ ను కూడా సంప్రదించామని, వారి సలహా మేరకే తమిళనాడులోని సెయిల్ స్టీల్ ప్లాంటుకు నాణాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. 2018, జూన్ 26 నాటికి చెలామణిలో లేని అన్ని నాణాలనూ డిస్పోజ్ చేయాలని టీటీడీ ట్రస్ట్ బోర్డ్ నిర్ణయించింది.

గత సంవత్సరం ఏప్రిల్ 18న నాణాలను కరిగించేందుకు టీటీడీకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించింది. ఇక మెట్రిక్ టన్ను నాణాలకు రూ. 29,972 ఇచ్చేందుకు సెయిల్ తో అగ్రిమెంట్ కూడా కుదిరింది.

More Telugu News