నన్ను తిట్టుకోవడం సహజమే: మండలి చైర్మన్ షరీఫ్

26-01-2020 Sun 15:53
  • ఏపీ గవర్నర్ ను కలిసిన షరీఫ్
  • రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించలేదన్న మండలి చైర్మన్
  • షరీఫ్ పై మండిపడుతున్న అధికార పక్షం!
ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ రాష్ట్ర గవర్నర్ తో భేటీ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండలి రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తలపై తాను స్పందించబోనని స్పష్టం చేశారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో తనను దూషించడం అనేది సర్వసాధారణం అని తేలిగ్గా తీసుకున్నారు. అయితే తాను రూల్స్ కు విరుద్ధంగా ఎక్కడా వ్యవహరించలేదని, నియమ నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకున్నానని వెల్లడించారు. వైసీపీ సర్కారు వికేంద్రీకరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టగా, దాన్ని మండలి చైర్మన్ హోదాలో తన విచక్షణాధికారం ఉపయోగించి షరీఫ్ సెలెక్ట్ కమిటీ ముందుకు పంపుతున్నట్టు ప్రకటించారు. దాంతో ఆయనపై అధికార పక్షం ఆగ్రహంతో రగిలిపోతోంది. షరీఫ్ ను ఓ వైసీపీ మంత్రి తీవ్రపదజాలంతో దూషించినట్టు వార్తలు వచ్చాయి.