TV9: లైంగిక వేధింపులు... 'భారత్ వర్ష్' చానెల్ ఔట్ పుట్ ఎడిటర్ రాజీనామా!

  • గత సంవత్సరం ప్రారంభమైన టీవీ9 భారత్ వర్ష్
  • అజయ్ ఆజాద్ పై ఇద్దరు మహిళల ఫిర్యాదు
  • రాజీనామాను ఆమోదించామన్న యాజమాన్యం

ప్రముఖ టెలివిజన్ చానెల్ టీవీ9 హిందీ విభాగం 'భారత్ వర్ష్' ఔట్ పుట్ ఎడిటర్ అజయ్ ఆజాద్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాగా, రాజీనామా చేశారు. గత సంవత్సరం టీవీ9 భారత్ వర్ష్ ప్రారంభం కాగా, అజయ్ ఆజాద్ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు ఉద్యోగినులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న యాజమాన్యం, అతన్ని సెలవుపై పంపి, ఇంటర్నల్ కమిటీని నియమించి, విచారణ జరిపించింది. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశారని, వెంటనే దాన్ని ఆమోదించామని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా చానెల్ తెలిపింది.

కాగా, ఇద్దరు జర్నలిస్టులు అజయ్ పై ఫిర్యాదు చేశారని, ఆ వెంటనే మహిళలపై లైంగిక నేరాల నివారణ చట్టం ప్రకారం, విషయాన్ని ఐసీసీకి నివేదించామని, సాక్షులను విచారించిన తరువాత ఆయనకు నోటీసులు పంపామని, సెలవుపై వెళ్లిన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారని పేర్కొంది. కాగా, తొలుత తమకు టెక్ట్స్ మెసేజ్ లు పంపిన ఆజాద్, ఆపై వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీయడం ప్రారంభించారని, 'సార్' అని పిలవవద్దని తమకు చెప్పేవారని, సొంత మనిషిలా అనుకోవాలని చెబుతుండేవారని, బయట కలుద్దామని, హోటల్ లో రూమ్ బుక్ చేయనా? అని అడిగారని అతనిపై ఫిర్యాదు చేశారు.

ఆపై కొన్ని రోజుల తరువాత మెసేజ్ ల తీవ్రతను పెంచి, తనను లవ్ చేయాలని ప్రెజర్ తెచ్చారని, తనను 'జాన్' అని పిలవాలని వేధించాడని, తాకరాని చోట కూడా తాకి ఇబ్బంది పెట్టాడని ఓ ఉద్యోగిని తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

More Telugu News