Tamil Nadu: చెక్ పోస్టు వద్ద ఎస్ఐని కాల్చడమే కాదు...కత్తితోనూ పొడిచి చంపారు

  • అధికారుల దర్యాప్తులో సంచలన అంశాలు 
  • నిందితులు ఇద్దరు...సహకరించింది మరో ఇద్దరు 
  • అదుపులోకి తీసుకున్న వారిని రహస్యంగా విచారణ

కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో కన్యాకుమారి జిల్లాలోని కలియక్కవిలయ్ చెక్ పోస్టు వద్ద విధుల్లో ఉన్న ఎస్ఐ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బుధవారం రాత్రి పది గంటల సమయంలో ఇక్కడ విధుల్లో ఉన్న విల్సన్ (57) అనే ఎస్ఐని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. చెక్ పోస్టు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా తిరువనంతపురం వైపు నుంచి వస్తున్న ఓ స్కార్పియోను ఆపే ప్రయత్నం చేశారు. అయితే వాహనంలోని ఇద్దరిలో ఓ వ్యక్తి బయటకు వచ్చి విల్సన్ పై మూడు రౌండ్లు కాల్పులు జరిపి అనంతరం వాహనాన్ని వదిలేసి పారిపోయారు.

సమాచారం అందగానే అలర్టయిన పోలీసులు నిందితులు తౌఫిక్, అబ్దుల్ సమీమ్ లను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా నిన్న వీరిద్దరినీ చెక్ పోస్టు వద్దకు తీసుకు వచ్చి సీన్ రీకనస్ట్రక్షన్ చేశారు. ఈ సందర్భంగా విల్సన్ పై కాల్పులు జరపడమేకాక కత్తితో కూడా దాడి చేసినట్టు తేలింది. తౌఫిక్ కాల్పులు జరపగా, సమీమ్ కత్తితో అతన్ని పొడిచాడని తేలింది.\

ఘటనానంతరం నిందితులు ఇద్దరూ సమీపంలోని మసీదు వెనుక భాగంలో ఉన్న ప్రహరీ దూకి రోడ్డు పైకి వచ్చారు. వాహన చోదకులు ఎవరూ లిఫ్ట్ ఇవ్వక పోవడంతో ఆటోలో కొంతదూరం వెళ్లి అక్కడి నుంచి బస్సులో తిరువనంతపురం చేరుకున్నారు.

కాగా, చెక్ పోస్టు వద్ద విచారణ అనంతరం నిందితులు ఇద్దరినీ పోలీసులు రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి విచారిస్తున్నారు. వీరిద్దరికీ సహకరించారన్న అనుమానంతో కడలూరు జిల్లా నైవేలీలోని ఖాజామొహిద్దీన్, కొండూరులోని ఆలీ ఇళ్లలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.

More Telugu News