assom blasts: వరుస పేలుళ్లతో దద్దరిల్లిన ఈశాన్య రాష్ట్రం అసోం

  • రిపబ్లిక్ డే రోజు ఘటనతో తీవ్ర కలకలం
  • ఉలిక్కిపడిన భద్రతా బలగాలు 
  • డిబ్రూగర్ జిల్లా గ్రాహం బజార్‌లో తొలి పేలుడు

రిపబ్లిక్ డే రోజున దేశంలో ఉగ్రమూకలు కల్లోలం రేపే ప్రయత్నం చేసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిఘావర్గాలు గత కొన్ని రోజులుగా చేస్తున్న హెచ్చరికలను నిజం చేస్తూ ఈశాన్య రాష్ట్రం అసోంలో ఈరోజు ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయి. డిబ్రూగర్, చరైదేవ్, దులియాజాన్ ప్రాంతాల్లో గ్రనేడ్ పేలుళ్లు సంభవించాయి. ఇది యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ - ఇండిపెండెంట్ (యూఎల్ఎఫ్ఏఐ) పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

గణతంత్ర వేడుకలను బహిష్కరించాలని ఈ నిషేధిత సంస్థ నిన్ననే పిలుపునిచ్చింది. జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలు స్థానికంగా  కలకలానికి కారణమయ్యాయి. గ్రాహం బజార్ లో తొలి పేలుడు సంభవించగా ఆ తర్వాత పలు ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించాయి.

ఓ వైపు రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా సంచలనమైంది. అనుమానిత ప్రాంతాల్లో మోహరించిన బలగాలు ప్రజల్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అప్రమత్తం చేస్తున్నాయి. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News