తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్... సంకేతాలిచ్చేసిన కేసీఆర్!

26-01-2020 Sun 08:59
  • సమయం సందర్భం చూసి నిర్ణయం
  • సీఏఏకు వ్యతిరేకంగా పోరాడేందుకు జాతీయ రాజకీయాల్లోకి
  • మంత్రుల వ్యాఖ్యలు 'విష్ ఫుల్ థింకింగ్' 
  • కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణకు కేటీఆర్ తదుపరి సీఎం కాబోతున్నారా? తన కుమారుడిని సీఎంగా చూడాలని కేసీఆర్ కూడా ఆసక్తిగా ఉన్నారా? నిన్న మునిసిపల్ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం కేసీఆర్, చేసిన సుదీర్ఘ ప్రసంగంలోని కొన్ని అంశాలను గమనిస్తే, అవుననే అనిపిస్తోంది. పురపాలక ఎన్నికల్లో తాను ప్రచారం చేయకపోయినా, ముందుండి నడిపించినదని కేటీఆర్ అని గుర్తు చేసిన కేసీఆర్, విజయ సారధి అతనేనంటూ ఆశీస్సులు అందించారు. ఇదే సమయంలో క్యాబినెట్ మంత్రులు తదుపరి సీఎంపై చేసిన వ్యాఖ్యలు 'విష్ ఫుల్ థింకింగ్' అని అభిప్రాపడ్డారు.

ఇదే సమయంలో వాళ్లు, వీళ్లు అంటున్నారని కాకుండా, సమయాన్ని, సందర్భాన్ని బట్టి టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అంతే కాదు, సీఏఏ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకిస్తుందని, త్వరలోనే తాను సీఎంల సమావేశాన్ని నిర్వహించి, కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలతో కలిసి కేంద్రం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకునేందుకు పోరాడతానని అన్నారు. దేశ భవిష్యత్తు కోసం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కూడా పేర్కొన్నారు.

ఇక కేసీఆర్ ప్రసంగాన్ని విశ్లేషిస్తున్న రాజకీయ పండితులు, కేటీఆర్ కు సీఎం బాధ్యతలు ఇచ్చేందుకు మరెంతో సమయాన్ని కేసీఆర్ తీసుకోకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరో నెలలో జాతీయ రాజకీయాల్లో తాను కీలకం అవుతానని కేసీఆర్ వ్యాఖ్యానించగా, స్వల్ప వ్యవధిలోనే కేటీఆర్ తెలంగాణకు కొత్త సీఎం అయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

ఇక, మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించగా, 90 శాతానికి పైగా మునిసిపాలిటీల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ఎన్నికల ఫలితాల అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్ కు రాగా, ఆయన్ను అభినందించేందుకు టీఆర్ఎస్ నేతలు వెల్లువెత్తారు. ఆపై ప్రగతి భవన్ కు కేటీఆర్ వెళ్లగా, కుటుంబీకులు హారతులిచ్చి స్వాగతం పలికారు. తల్లి శోభ, భార్య శైలిమ, కుమార్తె అలేఖ్య తదితరులు తిలకం దిద్ది కేటీఆర్ ను ఆహ్వానించారు. మొత్తం మీద టీఆర్ఎస్ ఘన విజయం క్రెడిట్ మొత్తం కేటీఆర్ ఖాతాలోకి వెళ్లిపోవడంతో, ఆయనే కాబోయే సీఎం అని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.