Omar Abdullah: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా.. ఫొటో చూసి దిగ్భ్రాంతికి గురైన మమత

  • గుబురు మీసం, గడ్డంతో కనిపించిన ఒమర్
  • సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ చానల్ ప్రతినిధి
  • గుర్తుపట్టేకపోయానన్న మమత బెనర్జీ

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన ఫొటోను చూసిన పలు పార్టీల నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి ఒమర్ సహా పలువురు కశ్మీర్ నేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలోకి తీసుకుంది. ఇటీవల ఆయనను గుపార్క్ రోడ్డులోని ఎం-4 ప్రభుత్వ బంగ్లాకు మార్చారు.

ఎప్పుడూ నున్నటి షేవ్‌లో కనిపించే ఒమర్ తాజాగా, గుబురు మీసాలు, గడ్డంతో దర్శనమిచ్చారు. తలకు మంకీ క్యాప్, నీలంరంగు కోటుతో కురుస్తున్న మంచు మధ్య నిలబడ్డ ఆయనను ఒమర్ అంటే నమ్మశక్యం కానంతగా ఉన్నారు. ప్రభుత్వం ఆయనను నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత ఒమర్ మళ్లీ కనిపించడం ఇదే తొలిసారి. ఓ చానల్ విలేకరి ఒమర్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

ఈ ఫొటోపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందించారు. ‘అయ్యో.. అతను ఒమరా’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను కూడా గుర్తుపట్టలేకపోయానన్నారు. ఒమర్‌ను అలా చూడడం చాలా బాధగా ఉందన్న మమత.. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరమన్నారు. దీనికి అంతం ఎప్పుడోనని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News