Kinjarapu Acchamnaidu: అచ్చెన్నాయుడు, యనమలపై కీలక బాధ్యతలు ఉంచిన చంద్రబాబు!

  • ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా చూసుకునే ప్రయత్నాలు
  • అండగా పార్టీ నిలుస్తుందని ప్రతి ఒక్కరికీ చంద్రబాబు హామీ
  • నేడు జాతీయ కార్యాలయంలో కీలక సమావేశం

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగి, తమ పార్టీ నుంచి ఎమ్మెల్సీలు ఫిరాయించకుండా చూసేందుకు రంగంలోకి దిగిన చంద్రబాబు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడులకు సమన్వయ బాధ్యతలను అప్పగించారు. ఎవరూ వైసీపీవైపు మొగ్గు చూపకుండా చూసేందుకు వీరు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. గడచిన రెండు రోజులుగా, ప్రతి ఎమ్మెల్సీతోనూ స్వయంగా మాట్లాడిన చంద్రబాబు, ఎటువంటి ఆందోళనా వద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు.

ఇక శాసనమండలి విషయమై భవిష్యత్ వ్యూహాన్ని చర్చించేందుకు నేడు టీడీపీ జాతీయ కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. దీనికి చంద్రబాబు అధ్యక్షత వహించనుండగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా హాజరు కావాలని పార్టీ ఆదేశించింది.

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత, పలు కీలక బిల్లులు మండలిలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. పరిపాలనను వికేంద్రీకరిస్తూ, మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తదితర బిల్లులన్నీ ఆగిపోగా, 'అసలీ శాసనమండలి మనకు అవసరమా?' అని జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కూడా. ఓ వైపు మండలి రద్దుపై ముందడుగు ఎలా వేయాలన్న విషయమై జగన్ సర్కారు సమాలోచనలు చేస్తున్న వేళ, తమ పదవులు కాపాడుకునేందుకు కొందరు టీడీపీ ఎమ్మెల్సీలు వైసీపీవైపు చూస్తున్నారని సమాచారం.

ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు నేటి టీడీపీ సమావేశానికి రాబోవడం లేదని స్పష్టం చేయడం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్, సరస్వతి, తిప్పేస్వామి తాము రాలేమని చెప్పగా, శత్రుచర్ల విజయరామరాజు అనారోగ్యం కారణంగా హాజరు కాలేనని అన్నారు. ఇక సోమవారం నాడు శాసనసభలో మండలి రద్దుపై చర్చ జరుగుతుందన్న ఊహాగానాల మధ్య, అసలు సభకు హాజరుకావాలా? వద్దా? అన్న విషయమై టీడీపీ నేడు నిర్ణయం తీసుకోనుంది.

More Telugu News