KCR: ఈ ఎన్నికల్లో కూడా బాగానే మొరిగారు... ఒకడెవడో నా ముక్కు కోస్తాడంట!: విపక్షాలపై కేసీఆర్ విసుర్లు

  • సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై కేసీఆర్ ఆగ్రహం
  • రేపట్నించి కఠినచర్యలు తప్పవని హెచ్చరిక
  • రాజకీయనేతలంటే ప్రజల్లో అసహ్యం వచ్చేసిందని వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 100కి పైగా స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ విపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. విపక్ష నేతల నోళ్లకు మొక్కాలని వ్యంగ్యం ప్రదర్శించారు. కొన్ని నిరంతరం మొరిగే కుక్కలు ఈ ఎన్నికల్లో కూడా బాగానే మొరిగాయని విమర్శించారు. వాళ్లు ఏం మాట్లాడతారో వారికే తెలియదని, ఒక అర్థం, తాత్పర్యం ఏమీ ఉండవని అన్నారు.

"ఓ హద్దులేదు, అదుపులేదు, విలువల్లేవు. ఒకడైతే ముఖ్యమంత్రిని ముక్కు కోస్తానంటాడు. అసదుద్దీన్ ఒవైసీ గడ్డం తీసి నాకు అతికిస్తాడంట! వాళ్లు జాతీయ పార్టీకి చెందినవాళ్లు. ఇదీ వాళ్ల సంస్కారం! ప్రజలు వాళ్లకు కర్రు కాల్చి వాతపెట్టినట్టు జవాబిచ్చారు. సోషల్ మీడియాలో కూడా నీచాతినీచంగా మాట్లాడుతున్నారు. రేపట్నించి ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఇలా సంస్కారం లేకుండా వ్యక్తిగత దూషణలు చేస్తే ఎంతటివారినైనా సహించేది లేదు.

ఇప్పటికే రాజకీయాలన్నా, రాజకీయ నేతలన్నా ప్రజల్లో అసహ్యం వచ్చేసింది. నేతల బతుకులు కార్టూన్ బతుకులయ్యాయి. మరింత కార్టూన్ బతుకులు కాకూడదనుకుంటే నేతలు ఆలోచించాలి. తిట్టుకోవాలనుకుంటే రేపు సాయంత్రం వరకైనా తిట్టుకోవచ్చు. దేశంలో తిట్లకు కొదవలేదు. దేనికైనా ఓ హద్దు, అదుపు అనేవి ఉండాలి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు మొరిగారు. తమ స్థాయిని మించి అధిక ప్రసంగాలు చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనేది ప్రజలు చూపిస్తున్నారు" అంటూ విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News