Nirbhaya: రాష్ట్రపతి క్షమాభిక్షను రద్దు చేయడంపై.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్భయ దోషి

  • సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసిన ముఖేశ్ సింగ్
  • ఆర్టికల్ 32 కింద రివ్యూ పిటిషన్
  • ఫిబ్రవరి 1న నిర్భయ దోషులకు అమలుకానున్న ఉరిశిక్ష

నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేశ్ కుమార్ సింగ్ (32) పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈనెల 17న తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో, కేసులోని నలుగురు దోషులకు ఫిబ్రవరి 1వ తేదీన ఉరిశిక్షను అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఉరితీతను వీలైనన్ని రోజులు వాయిదా వేయించేందుకు దోషులు కోర్టుల్లో ఏదో ఒక పిటిషన్ వేస్తూనే ఉన్నారు. తాజాగా ముఖేశ్ సింగ్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించడంపై రివ్యూ పిటిషన్ వేశాడు.

ఈ సందర్భంగా ముఖేశ్ సింగ్ తరపు న్యాయవాది వృందా గ్రోవర్ మీడియాతో మాట్లాడుతూ, ఆర్టికల్ 32 కింద పిటిషన్ వేశామని తెలిపారు. శత్రుఘ్న చౌహాన్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన జడ్జిమెంట్ ఆధారంగా... రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించడంపై జ్యూడీషియల్ రివ్యూ కోరామని చెప్పారు.

మరోవైపు ఇప్పటికే ముఖేశ్ సింగ్, అక్షయ్ కుమార్ వేసిన క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మరో ఇద్దరు దోషులు పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మలు సుప్రీంలో ఇంకా క్యూరేటివ్ పిటిషన్లు వేయలేదు. నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాలంటూ డెత్ వారంట్ జారీ అయిన సంగతి తెలిసిందే.

More Telugu News