Telugudesam: ఎనిమిది నెలలకే వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టిపోయింది: టీడీపీ నేత గోరంట్ల విమర్శలు

  • ఇది ప్రజారాజ్యమా? నియంతల ప్రభుత్వమా? 
  • ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు
  • నువ్వెంత? నీ గోబెల్స్ ప్రచారం ఎంత?’ అంటున్న గోరంట్ల 

సభలో జరుగుతున్న ప్రొసీడింగ్స్ ను చూపించకుండా ఆపడాన్ని ‘టెక్నికల్ ప్రాబ్లమ్’ అని వైసీపీ సభ్యులు చెబుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది ప్రజారాజ్యమా? ప్రజా ప్రభుత్వమా? లేదా నియంతల ప్రభుత్వమా? అని వైసీపీ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.

‘ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు నువ్వెంత? నీ గోబెల్స్ ప్రచారం ఎంత?’ అంటూ జగన్ ని ప్రశ్నించారు. ఎనిమిది నెలలకే భ్రష్టుపట్టిపోయిన ప్రభుత్వం ఇదని, పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, మీడియాపై కేసులు బనాయిస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు బూతులు మాట్లాడితే వాళ్లపై కేసులు పెట్టరా? తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టరా? అంటూ విరుచుకుపడ్డారు. శాసనమండలిలో మైనార్టీ నాయకుడిపై వైసీపీ నేతలు వాడిన భాషను ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయం ప్రకారం వైసీపీ ప్రభుత్వం నడవడం లేదని, దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

రాజధాని అమరావతి తరలింపు అనేది కేవలం 29 గ్రామాల ప్రజలకు సంబంధించిన సమస్య అని అనడం తగదని, ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమస్య అని అన్నారు. ఏపీికి రావాల్సిన పెట్టుబడులు తరలిపోతున్నాయని, అధికారపక్ష సభ్యుల దమనకాండకు తట్టుకోలేమని వారు భావిస్తున్నారని, గత ప్రాభవం అంతరించిపోతోందని విమర్శించారు.

More Telugu News