Yanamala: ఆ కేసు నుంచి జగన్ తప్పించుకోవడం అసాధ్యం: యనమల

  • మనీలాండరింగ్ కేసు నుంచి తప్పించుకోలేరు
  • ట్రయల్ మొదలైతే జగన్ దృష్టంతా కోర్టు బోనుపైనే ఉంటుంది
  • అధికారం ఉందని ఇష్టానుసారం చేయడం సరికాదు

అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను సీబీఐ కోర్టు నిన్న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... మనీలాండరింగ్ కేసు నుంచి జగన్ తప్పించుకోవడం అసాధ్యమని వ్యాఖ్యానించారు. మొత్తం 11 ఛార్జిషీట్లలో ట్రయల్ మొదలైతే... జగన్ దృష్టంతా కోర్టు బోనుపైనే ఉంటుందని అన్నారు. బోనులో ఉంటే జనాలు అసహ్యించుకుంటారని... అందుకే ప్రజల దృష్టిని మరల్చడానికి రాష్ట్రంలో గందరగోళానికి తెర లేపారని విమర్శించారు.

అధికారం ఉందని ఇష్టానుసారం చేయడం సరికాదని యనమల అన్నారు. తొలుత ఆర్డినరీ రూపంలో వచ్చిన వికేంద్రీకరణ బిల్లు ఆ తర్వాత మనీ బిల్లుగా వచ్చిందని చెప్పారు. ఎస్సీ కమిషన్, ఆంగ్ల మాధ్యమం బిల్లులు మండలికి ఆర్డినరీ బిల్లులుగా వచ్చాయని తెలిపారు. మూడు రాజధానుల బిల్లు ఆర్డినరీ బిల్లా?లేక మనీ బిల్లా? అని హైకోర్టు సైతం ప్రశ్నించిందని చెప్పారు. ఈ రెండు బిల్లులకు పద్ధతులు వేర్వేరుగా ఉంటాయని అన్నారు. ప్రజాభిప్రాయం తీసుకుని చేయాల్సిన నిర్ణయాలను వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తోందని మండిపడ్డారు. బిల్లులను మంత్రులు చదువుతున్నారా? అని యనమల ప్రశ్నించారు.

More Telugu News