Kodangal: కొడంగల్ లో రేవంత్ రెడ్డికి మళ్లీ నిరాశ!

  • కొడంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం
  • 12 వార్డులకు గాను 8 వార్డులు కైవసం
  • మూడు వార్డులతో సరిపెట్టుకున్న కాంగ్రెస్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వెలువడుతున్న ఫలితాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ ను అమాంతం పెంచేశాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను స్వీప్ చేసే దిశగా టీఆర్ఎస్ దూసుకుపోతోంది. మరోవైపు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, ఎంపీ రేవంత్ రెడ్డికి మరోసారి నిరాశ ఎదురైంది. తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ లో సైతం టీఆర్ఎస్ సత్తా చాటింది. 12 వార్డులకు గాను 8 వార్డులను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. కేవలం మూడు వార్డుల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. కాంగ్రెస్ ను గెలిపించుకునేందుకు రేవంత్ తీవ్రంగా శ్రమించినా ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రాలేదు.

కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో, కొడంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయాన్ని కట్టబెట్టడం ద్వారా సొంత నియోజవర్గంలో మళ్లీ సత్తా చాటాలని భావించిన రేవంత్ కు ఈ ఫలితాలు నిరాశను కలిగించేవే.

More Telugu News