AAP: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ప్రత్యర్థులుగా డ్రైవర్లు, కండక్టర్లు, సన్యాసులు!

  • కేజ్రీవాల్‌కు ప్రత్యర్థులుగా బరిలోకి 88 మంది
  • చివరికి మిగిలింది 28 మందే
  • ఆప్‌ను పోలిన మరో ‘ఆప్’ కూడా బరిలోకి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం పూర్తయింది. అయితే, ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది మాత్రం న్యూఢిల్లీ సీటే. ఎందుకంటే.. సీఎం కేజ్రీవాల్‌పై పోటీ కోసం ఏకంగా 88 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 54 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, 34 మంది మిగిలారు. వీరిలో 28 మంది మాత్రమే పోటీ పడుతున్నట్టు తుది జాబితాను బట్టి తెలుస్తోంది.

ఇక, కేజ్రీవాల్‌కు ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన వారిలో డ్రైవర్లు, కండక్టర్లు, సన్యాసులు కూడా ఉండడం గమనార్హం. అభ్యర్థుల పార్టీ పేర్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని పోలి ఉండడం విశేషం. సీఎంకు పోటీగా ‘ఆప్’ అనే అంజాన్ ఆద్మీ పార్టీ కూడా పోటీకి దిగింది. ఆ పార్టీ నుంచి శైలేంద్ర సింగ్ పోటీపడుతున్నారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బరిలోకి దిగిన పార్టీల్లో భారతీయ లోక్ తాంత్రిక్ పార్టీ, పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా, విజయ్ భారత్ పార్టీ, రైట్ టు రీకాల్ పార్టీ, రాష్ట్రీయ రాష్ట్రవాది పార్టీ వంటివి కొన్ని వున్నాయి. 

More Telugu News